
రోడ్డుప్రమాదంలో ఆటోడ్రైవర్ మృతి
కొణిజర్ల: మండలంలోని పల్లిపా డు సమీపాన రైస్ మిల్ ఎదురుగా ఆటోను లారీ ఢీకొట్టగా ఆటోడ్రైవర్ మృతి చెందాడు. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన సయ్యద్ సైదులు(45) తన ఆటోలో మంగళవారం రాత్రి ఖమ్మం నుండి వైరా వెళ్తుండగా పల్లిపాడు సమీపాన వైరా నుంచి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జు కాగా, సైదులు తీవ్రగాయాలతో అందులో ఇరుక్కుపోయి మృతి చెందాడు.
ద్విచక్రవాహనదారుడికి
తీవ్రగాయాలు
తల్లాడ: తల్లాడ మండలం నరసింహారావుపేట సమీపాన కంకర మిల్లు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. జగన్నాధపురం గ్రామానికి చెందిన తుమ్మ వెంకటేశ్వర్లు(65) ద్విచక్ర వాహనంపై ఏన్కూరు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుండగా, 108వాహనంలో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
విత్తన లోపంతో
నష్టపోయామని ఫిర్యాదు
తల్లాడ: మొక్కజొన్న విత్తన లోపంతో దిగుబడి రాక నష్టపోయామని తల్లాడ మండలం మండలం ముద్దునూరుకు చెందిన పలువురు రైతులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. గ్రామ రైతులు 25మంది 2024 నవంబర్, డిసెంబరులో 80ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఆడ మగ విత్తనాలను విత్తన కంపెనీ ఏజెంట్ దేవరపల్లి జగన్నాధం సరఫరా చేయగా, 40 క్వింటాళ్లుగా చెప్పిన దిగుబడి 5నుంచి 10క్వింటాళ్లు దాటలేదు. దీంతో ఒక్కో రైతుకు ఎకరానికి రూ.50 వేల మేర నష్టం వాటిల్లగా కంపెనీ నుంచి జూన్ 1వ తేదీకల్లా పరిహారం ఇప్పిస్తానని ఏజెంట్ జగన్నాధం హామీ ఇచ్చాడు. ఇప్పటివరకు స్పందన లేకపోగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన రైతుల్లో బి.కృష్ణారావు, మంకెన గోపాల్, సాదం లక్ష్మణ్‌రావు, జి.శ్రీనివాసరావు, హరీష్, కృష్ణ, కొండలరావు, నరసింహారావు, చంటి, ప్రసాద్, బాబురావు, సైదురెడ్డి, మన్నె రామారావు తదితరులు ఉన్నారు.
4కేజీల గంజాయి స్వాధీనం
మధిర: ఒడిశా నుంచి తీసుకొచ్చి మధిర చుట్టుపక్కల ప్రాంతాల్లోఅమ్మేందుకు సిద్ధం చేసిన నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మధిర టౌన్ సీఐ రమేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని భూక్యా అనూష్ నాయక్, కుంచం గోపీచంద్, మరో మైనర్ బాలుడు తీసుకొచ్చినట్లు అందిన సమాచారంతో మధిర టౌన్ ఎస్‌ఐ ఎం.కిషోర్‌కుమార్ ఆధ్వర్యాన మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈమేరకు రూ.2లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాక కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
చీటింగ్ కేసు నమోదు
ఇల్లెందురూరల్: షోరూం నిర్వహణ విషయంలో ఓ వ్యక్తిపై పోలీసులు మంగళవారం చీటింగ్ కేసు నమోదు చేశారు. ఖమ్మానికి చెందిన ఈశ్వరప్రగడ రంగనాథ్ ఇల్లెందు మండలం సుభాష్‌నగర్‌లో బైక్ షోరూం ప్రారంభించాడు. నిర్వహణ బాధ్యతను ఇల్లెందుకు చెందిన యాలం దయాసాగర్‌కు అప్పగించచగా యజమానికి తెలియకుండా రూ. 12.31 లక్షల విలువైన బైక్‌లను విక్రయించి నగదు సొంతానికి వాడుకున్నాడు. అందులో కొంత చెల్లించినా, రూ.8.82లక్షలు చెల్లించకపోవడంతో రంగనాథ్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.