
నానో యూరియాతో తగ్గనున్న ఖర్చు
మధిర: పంటలకు గుళికల యూరియా బదులు ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వినియోగంతో ఖర్చు తగ్గడమే కాక ఫలితాలు బాగుంటాయని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. మధిర మండలం ఆత్కూర్‌లో పలువురు రైతులు సాగు చేసిన పత్తి పంటను మంగళవారం పరిశీలించిన ఆయన నానో యూరియా, డీఏపీపై అవగాహన కల్పించారు. నానో యూరియాతో మొక్కకు పోషకాలు ఎక్కువ మోతాదులో అందుతాయని తెలిపారు. కాగా, పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8 – 10 చొప్పున ఏర్పాటు చేసుకోవాలని, ఉధృతి ఉంటే పురుగు మందులను వేపనూనెతో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ జిష్ణు తదితరులు పాల్గొన్నారు.