
ప్రయాణం.. ప్రాణ సంకటం
గుంతలమయంగా మారిన రహదారులు
● జిల్లాలో పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లు.. ● గతేడాది భారీ వర్షాలకు ధ్వంసమైన వైనం ● మరమ్మతులు చేపట్టక వాహనదారుల ఇక్కట్లు
వర్షాలకు దెబ్బతిని..
తల్లాడ – కొత్తగూడెం, తల్లాడ – సత్తుపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్లు పలుచోట్ల గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తల్లాడ – లక్ష్మీనగర్, బిల్లుపాడు – అంజనాపురం, మల్సూర్‌తండా వద్ద రోడ్లు పాడయ్యాయి. తారు కొట్టుకుపోయింది. తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్‌లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్నారుగూడెం – నరసింహారావుపేట వద్ద కూడా రోడ్డు అక్కడక్కడా దెబ్బతిన్నది. రోడ్లు ఇలా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల వెళ్లే వాహనాలన్నీ ఈ రోడ్డుపైనే వస్తుంటాయి. ఇప్పటికై నా ఈ రోడ్డు మరమ్మతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లాలోని ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భారీ గుంతలతో ఉన్న రహదారులు వాహనదారులను భయపెడుతున్నాయి. ఏడాదిగా రోడ్లన్నీ ఈ దుస్థితిలోనే ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆయా శాఖల పరిధిలో ప్రతిపాదనలు పంపడం, నిధులు మంజూరయ్యాయని చెప్పడానికే పరిమితమయ్యారు తప్పితే.. కొత్త రహదారుల మాట అటుంచి కనీసం గుంతలు పూడ్చడం, మరమ్మతులు చేయడం కూడా మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఈ రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలగడంతో పాటు పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతేడాది తుపానుతో జిల్లాలోని పలు రహదారులు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు.
అధ్వానం.. అసౌకర్యం..
జిల్లాలోని రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారులు గత ఏడాది వచ్చిన భారీ వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల దుస్థితి అధ్వానంగా ఉంది. అలాగే వైరా – జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై పలు చోట్ల గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో నీరు నిల్వడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వైరా మండలం స్టేజీ పినపాక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌టీఆర్ జిల్లా నెమలికి వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. రోడ్డు మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. పైగా పలుచోట్ల కంకర తేలి గుంతల్లో నీరు నిలిచింది. ఆ రోడ్డుపై వాహదారులు వేగంగా వస్తే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. వైరా – కొణిజర్ల, కొణిజర్ల మండలంలోని పలు రహదారుల పరిస్థితీ ఇలాగే ఉంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లన్నీ అధ్వానంగా మారాయి.
ప్రయాణం.. ప్రమాదమే..
భారీ గుంతలు పడిన రోడ్లపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన రహదారులపై కొత్తగా ప్రయాణించేవారు వీటిపై అవగాహన లేక ప్రమాదాల బారిన పడిన ఘటనలు కూడా ఉన్నాయి. వైరా – జగ్గయ్యపేట రహదారిపై ఇలా పలు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయారు. కనీసం గుంతలు పూడ్చడంపై అయినా అధికారులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
దెబ్బతిన్న పల్లిపాడు – ఏన్కూరు రహదారి..
కొణిజర్ల మండలం పల్లిపాడు – ఏన్కూరు మధ్య రహదారి దెబ్బతిన్నది. ఖమ్మం నుంచి కొత్తగూడెం, భద్రాచలం వెళ్లేందుకు కొంత దూరం తగ్గేందుకు పలువురు ఈ రోడ్డుపై నుంచే వెళ్తుంటారు. దీంతో 2018లో అప్పటి ప్రభుత్వం దీన్ని డబుల్ రోడ్డుగా మార్చింది. ఇప్పుడు వర్షం పడితే రోడ్డంతా గుంతలమయం అవుతోంది. తీగల బంజర సమీపంలో పగిడేరు ప్రవహిస్తే రోడ్డు దాదాపు 100 మీటర్ల మేర కొట్టుకుపోతోంది. అధికారులు తూతూ మంత్రంగా మరమ్మతులు చేస్తున్నారు. ఈ రోడ్డుపై దాదాపు మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తీగలబంజరకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంతో సహా గుంతలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. పల్లిపాడు నుంచి అంజనాపురం వరకు, ఆ తర్వాత జన్నారం నుంచి ఏన్కూరు వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.

ప్రయాణం.. ప్రాణ సంకటం

ప్రయాణం.. ప్రాణ సంకటం

ప్రయాణం.. ప్రాణ సంకటం