
విద్యాశాఖకు దిక్కెవరు..?
● ఏళ్లుగా భర్తీ కాని డీఈఓ పోస్టు ● ఇన్‌చార్జ్‌లతో పాలన అంతంతమాత్రమే.. ● రెగ్యులర్ అధికారిని నియమించాలంటున్న ఉపాధ్యాయులు
ఖమ్మం సహకారనగర్ : అత్యంత కీలకమైన ప్రభుత్వ శాఖల్లో విద్యా శాఖ ఒకటి. అంతటి ప్రాధాన్యత గల శాఖకు జిల్లాలో సుమారు మూడేళ్లుగా రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల కాలం వరకు డైట్ ప్రిన్సిపాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించగా.. ఆయన రెండు బాధ్యతలు నిర్వహించాల్సి రావడంతో దేనిపైనా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని పాఠశాలలపై పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధ్యాయుల సర్దుబాటు, మంత్రులు, ఇతర అధికారుల కార్యక్రమాలకు డీఈఓ హాజరు కావాల్సి ఉంటుంది. వీటితో పాటు నిత్యం పాఠశాలలు, ఉపాధ్యాయులపై పర్యవేక్షణ చేయాలి. అలాంటి కీలక పోస్టు మూడేళ్లుగా ఖాళీగా ఉంది.
గతంలో అలా..
డైట్ లెక్చరర్‌గా ఉన్న సోమశేఖర శర్మను ఎఫ్‌ఏసీ డీఈఓగా నియమించగా ఆయన పనిచేసిన సుమారు రెండేళ్ల కాలంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఆయన డీఈఓగా ఉన్న సమయంలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వగా దానిపై విచారణ అనంతరం వారిని ఉద్యోగం నుంచి తొలగించారు.
ప్రస్తుతం ఇలా..
డైట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సత్యనారాయణ సుమారు మూడు నెలల క్రితం జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు శిక్షణ సమయంలో ప్రభుత్వం నిధులు కేటాయించగా, వాటిలో కొన్ని దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఆయన ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రోజు కూడా ఆయన పెండింగ్ ఫైళ్లపై సంతకాలు చేశారని కార్యాలయ సిబ్బంది బహిరంగంగానే చెబుతున్నారు. ఉద్యోగ విరమణకు ముందు కూడా పలు కీలక అంశాల్లో సంతకాలు చేశారనే విమర్శలు సైతం వస్తున్నాయి. వీటిపై సమగ్ర విచారణ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే..
జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో ఇతరులకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే వారిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇష్టారీతిన విధులు నిర్వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పిదాలు వెలుగుచూశాక తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడంతో ఇతర అధికారులు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి రెగ్యులర్ డీఈఓను నియమిస్తే పాలన గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాద్యాయులు అంటున్నారు.
జెడ్పీ డిప్యూటీ సీఈఓకు బాధ్యతలపై
అసంతృప్తి..
ఇన్‌చార్జ్ డీఈఓగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ పొందగా తాత్కాలికంగా జెడ్పీ డిప్యూటీ సీఈఓతో ఆ పోస్టు భర్తీ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తున్న సమయంలో పూర్తిస్థాయి డీఈఓ లేకుంటే ఎలా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓకు ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి డీఈఓ పోస్టు ఎలా ఇస్తారని అంటున్నారు.
వెల్లువెత్తుతున్న ఆరోపణలు..
జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై ప్రతీ ఏడాది తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగంలో మార్పు రాకపోవడం గమనార్హం. కీలక అధికారి పోస్టుకు ఇన్‌చార్జ్‌గా నియమితులైన అధికారి చేసే కార్యకలాపాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. సుమారు నాలుగేళ్లుగా విద్యాశాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో డైట్ కళాశాల సీనియర్ లెక్చరర్, ప్రిన్సిపాల్ ఎఫ్‌ఏసీ డీఈఓగా విధులు నిర్వహించారు. వీరిద్దరి పనితీరుపై పలు ఆరోపణలు వస్తుండడం విమర్శలకు బలం చేకూరుస్తోంది.