
పేదలందరికీ గూడు కల్పిస్తాం
ముదిగొండ : ప్రతీ పేదవాడికి గూడు నిర్మించే సంకల్పంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మండలంలోని కమలాపురంలో రూ.10 కోట్లతో నిర్మించే 10వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సకాలంలో సాగునీటి సరఫరా, రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాల అమలుతో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. సీతారామ ప్రాజెక్టుతో జిల్లా భూములు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి నీరు తెచ్చేలా చేసిన డిజైన్‌ను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతో ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే నీటికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. రాజకీయ విమర్శలకు తావు లేకుండా బనకచర్ల ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. రాష్ట్రంలో 95 లక్షల పేద కుటుంబాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 51 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా 104 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మిస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు రూ.21వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పెంచుతామని చెప్పారు. కమలాపురంలో చేపట్టిన గోదాముల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గోదాముల నిర్మాణం పూర్తయితే రైతులు పండించే వరి, ఇతర పంటల నిల్వలకు ఇబ్బంది ఉండదని అన్నారు. సన్న ధాన్యానికి రూ. 500 బోనస్‌తో వరి ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. అనంతరం పెదమండవ ఎస్సీ కాలనీలో రూ.58.50 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ముదిగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి బోర్డును ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎండీ లక్ష్మి, హస్త కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, సీపీ సునీల్‌దత్, డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, డీఎంఓ ఎంఏ. అబ్దుల్ అలీమ్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వాసిరెడ్డి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు మందరపు నాగేశ్వరరావు, వనం నర్సింగరావు, వల్లూరి భద్రారెడ్డి, వనం ప్రదీప్త చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రూ.22,500 కోట్లతో 4.5ం లక్షల ఇందిరమ్మ ఇళ్లు
95 లక్షల రేషన్ కార్డులు, 51 లక్షల కుటుంబాలకు ‘గృహజ్యోతి’
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
కమలాపురంలో గోదాం నిర్మాణానికి భూమి పూజ