
ఆస్పత్రుల అభివృద్ధిపై సర్కారు దృష్టి
తిరుమలాయపాలెం: గ్రామీణ, పట్టణ ప్రాంత ఆస్పత్రుల అభివృద్ధితో పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన తిరుమలాయపాలెం సీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు విధిగా చేయాలని, తక్షణమే వైద్య సేవలు అందించి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. డెంగీ వంటి సీజనల్ జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని చంద్రుతండా, అజ్మీరతండా గ్రామాల్లో ఇప్పటికే డెంగీ కేసులు నమోదయ్యాయని, ఇకపై కేసులు పెరగకుండా అదుపు చేయాలని అన్నారు. సిబ్బంది స్థానికంగా ఉండాలన్నారు. సీహెచ్‌సీలో సమస్యల పరిష్కారానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్యలు చేపట్టారని తెలిపారు. అనంతరం ఆపరేషన్ థియేటర్, డెలివరీ గది, వార్డు, ఫార్మసీ, రక్త నమూనాలు సేకరించే ల్యాబ్‌ను పరిశీలించారు. సిటిజన్ చార్ట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ చందూనాయక్, వైద్యులు బొల్లికొండ శ్రీనివాసరావు, కృపాఉషశ్రీ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, కమ్మకోమటి నాగేశ్వరరావు, చంద్రశేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఐ కమిషనర్ పి.వి.శ్రీనివాస్