
జమలాపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 – 15 గంటలకు శ్రీ స్వామివారి యాగశాలలో అర్చకులు పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనం, రుత్విక్కరణం, మండపారాధన నిర్వహించారు. శ్రీవారి పాదానికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం ప్రధాన కలశ స్థాపన, అగ్నిమథనం, హోమం నిర్వహించి పవిత్ర మాలలకు పుష్పాధివాసం,ఽ ధాన్యాధివాసం, శయ్యాధివాసం నిర్వహించారు. అనంతరం మహా నివేదన, నీరాజన మంత్రపుష్పం పఠించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.జగన్‌మోహన్‌రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ విజయకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.