
బాలల జీవితాల్లో వెలుగులు
● అనాథ పిల్లలకు గుర్తింపు కార్డుల జారీ ● జనన ధ్రువీకరణ, ఆధార్, ఎఫ్‌ఎస్‌సీ, ఆరోగ్యశ్రీ కార్డులు కూడా.. ● కలెక్టర్ చొరవతో 81 మంది పిల్లలకు లబ్ధి
ఖమ్మంమయూరిసెంటర్: కుటుంబీకులు ఎవరో తెలియక... చిరునామా లేకుండా జిల్లాలోని బాలల సదనం, అనాథ శరణాలయాల్లో ఉండడమే కాక ఉనికిని నిరూపించుకోలేని అసహాయత.. ప్రభుత్వ ఆసరాకు దూరంగా జీవిస్తున్న బాలల జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరించే సమయం ఆసన్నమైంది. జిల్లా యంత్రాంగం తీసుకున్న మానవీయ నిర్ణయం వారి బతుకులకు కొత్త అర్థాన్ని ఇవ్వనుంది. అనాథ బాలలందరికీ జనన ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులే కాక ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసే బృహత్తర కార్యక్రమానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శ్రీకారం చుట్టారు. దీన్ని పరిపాలనా ప్రక్రియగా కాక చిన్నారుల జీవితాలకు గౌరవప్రదమైన పునరుజ్జీవనంగా అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని 81 మంది అనాథ బాలలకు గుర్తింపు లభించనుంది.
నిరాశ నుండి నూతన ఆశకు..
సమాజంలో గుర్తింపు లేకపోవడం ఎంతటి వేదనో అనుభవించిన వారికే తెలుస్తుంది. అనాథ బాలలు అలాంటి వేదనను నిత్యం అనుభవించారు. పాఠశాల మెట్లు ఎక్కాలన్నా, అనారోగ్యానికి గురైతే వైద్యం పొందాలన్నా నువ్వెవరు.. అన్న ప్రశ్న ఎదురయ్యేది. ఆధార్ కార్డు కూడా లేని కారణంగా వారికి కేటాయించిన హక్కులు, అవకాశాలు దక్కలేదు. ప్రతీ చిన్న అవసరానికి ఆటంకాలు ఎదురవుతుండడం లేత మనస్సులపై ప్రభావం చూపించింది. కంటి నిండా కలలు ఉన్నా, సాకారం చేసుకునేందుకు కనీస మార్గం లేకపోవడాన్ని గ్రహించిన కలెక్టర్ అనుదీప్ మానవతా దృక్పథంతో బాలలకు సరైన దారి చూపాలని నిర్ణయించారు.
భవిష్యత్‌కు భరోసా..
చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలోని ప్రభుత్వ బాలల సదనంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యాన నిర్వహిస్తున్న అనాథశరణాలయాల్లో ఉన్న చిన్నారులకు గుర్తింపు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈమేరకు 81 మందికి ఎలాంటి గుర్తింపు లేదని తెలుసుకున్న అధికారులు కలెక్టర్ ఆదేశాలతో ఐడీ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. తొలుత జనన ధృవీకరణ పత్రం(ఆర్‌డీఓ ప్రొసీడింగ్స్ ద్వారా) ఇప్పించారు. ఆ పత్రం ఆధారంగా ఆధార్ కార్డు, అందులోని చిరునామా ఆధారంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు జారీ చేశారు. అంతేకాక ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేయడంతో అందరి లాగే ఆ చిన్నారులకు గుర్తింపుతో పాటు భవిష్యత్‌పై భరోసా లభిస్తోంది. అంతేకాక వారిలో ఆత్మవిశ్వాసం, ఆశలను.. సమాజంలో తమకంటూ ఒక స్థానం ఉందని గుర్తించే భరోసాను కల్పించినట్లయింది. కాగా, ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఉచితంగా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు పొందనుండడం విశేషం.
జిల్లాలో అనాథ బాలల వివరాలు..
బాలల సదనం 55
అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ, ఖమ్మం 15
శాంతి నిలయం, బోనకల్ 11
మొత్తం 81