
నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
ముదిగొండ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ముదిగొండ మండలంలో పర్యటించనున్నారు. కమలాపురంలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించే గిడ్డంగి, కమలాపురం, పెద్ద మండవ, వల్లభి, ముదిగొండల్లో రూ.10 కోట్ల నిధులతో నిర్మించే సీసీ రోడ్లకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.
మంత్రి పొంగులేటి..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఖమ్మం చేరుకోనున్న ఆయన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం, వేంసూరు మండలం అడసర్లపాడు, సత్తుపల్లిలో జరిగే ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు తిరుమలాయపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి.. లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అలాగే, ఆతర్వాత 6 గంటలకు కొక్కిరేణిలో అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేయనున్నారు.
శాకాంబరీ రూపంలో అమ్మవార్లు
ఎర్రుపాలెం: జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ఆవరణలోని స్వామివారి పాదానికి పంచామృతంతో అభిషేకం జరిపించారు. ఆతర్వాత అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను శాకాంబరీదేవి రూపంలో అలంకరించగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. అలాగే, స్వామి, అమ్మవార్ల కల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. కాగా, ఆదివారం నుంచి 5వ తేదీ వరకు ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈఓ కె.జగన్మోహన్‌రావు తెలిపారు. వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
భూసమస్యల
పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఎర్రుపాలెం: భూసమస్యలపై అందిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఎరుపాలెం తహసీల్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు పరిశీలించాక భూసంబంధిత సమస్యలపై ఆరా తీశారు. అలాగే, ములుగుమాడులో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూముల రీసర్వే, రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల పరిశీలన, భూభారతి పోర్టల్‌పై తహసీల్దార్ ఎం.ఉషాశారదతో చర్చించి సూచనలు చేశారు. ఆర్‌ఐ రవి, సర్వేయర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి కృషి
వైరారూరల్: పొలంబాట ద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సంబంధిత సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఎస్‌ఈ శ్రీని వాసాచారి తెలిపారు. వైరా మండలం దాచాపురంలో శనివారం నిర్వహించిన పొలం బాటలో ఆయన పాల్గొన్నారు. తక్కువ ఎత్తులో ఉన్న లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు తదితర సమస్యలు తెలుసుకోవడంతో పాటు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్ల ఏర్పాటుతో లాభాలను వివరించారు. ఏడీఏ కిరణ్‌కుమార్, ఏఈ వెంకటసాయి, లైన్‌మెన్ పాషా పాల్గొన్నారు.
సీనియారిటీ జాబితా విడుదల
ఖమ్మం సహకారనగర్: ఉపాధ్యాయుల పదో న్నతుల ప్రక్రియ మొదలైంది. ఈమేరకు స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 హెచ్‌ఎంలుగా పదోన్నతి కల్పించనుండగా శనివారం సీనియారిటీ జాబితాతో పాటు గ్రేడ్–2 హెచ్‌ఎం ఖాళీలను ప్రకటించారు. జిల్లాలో 2,859 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా 2,503 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో పదోన్నతులకు 260మందిని అర్హులుగా గుర్తించారు. కాగా, సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించాక తుదిజాబితా విడుదల చేయనున్న అధికా రులు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం పదోన్నతుల ఉత్తర్వులు జారీ చేస్తారు.

నేడు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన