
బయటకొస్తే భయం... భయం
● నానాటికీ పెరుగుతున్న కుక్కల దాడులు ● ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు ● కు.ని. చేస్తున్నామని చెబుతున్నా కానరాని ఫలితం
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గుంపులుగా తిరుగుతున్న శునకాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారులే కాక పెద్దలను కూడా వదలక దాడులు చేస్తుండడంతో వీధుల్లోకి రావాలంటే వణికిపోతున్నారు. ప్రధానంగా రాత్రివేళ కాలనీల్లో రహదారుల మధ్యలో బైఠాయిస్తున్న కుక్కలతో ఆ మార్గంలో వెళ్లాలంటే జంకే పరిస్థితులు నెలకొన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల వెంట పరుగులు తీస్తుండడంతో ప్రమాదాలు జరుగుతుండగా.. కుక్కల దాడిలో గాయపడిన వారు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.
గుంపులుగా సంచారం
జిల్లాలో దాదాపుగా అన్నిచోట్ల కుక్కల సమస్య ఉంది. జిల్లా కేంద్రంలోని ఏ కాలనీ, ఏ వీధికి వెళ్లినా గుంపులుగా కుక్కలు కనిపిస్తున్నాయి. శునకాల దాడిలో గాయపడి నిత్యం 30 – 40 మంది ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కుక్కల భయంతో రహదారులపై తిరిగేందుకు జంకుతుండగా.. పిల్లలను పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు తిరిగి వచ్చే ఆందోళనకు గడపాల్సి వస్తోంది. కాగా, శునకాల దాడిలో కొందరికి తీవ్రగాయాలు అవుతుండడంతో నయం కావడానికి నెలల సమయం పడుతోంది. ప్రభుత్వ ఆఆస్పత్రుల్లో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా సరైన వైద్యం అందక పలువురు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఆస్పత్రులకు క్యూ..
జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వినియోగం పెరిగిపోతోంది. సగటున రోజుకు 30 – 40 మంది కుక్కకాటు బాధితులు ఆస్పత్రులకు వస్తున్నారు. తక్కువ గాయాలైన వారికి నిర్ణీత గడువు ప్రకారం వ్యాక్సిన్ డోస్ వేస్తున్నారు. తీవ్రంగా గాయపడితే ప్రభుత్వ పరంగా సరైన చికిత్స అందక ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. కొందరు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,895 కుక్కకాటు కేసులు నమోదు కాగా.. ప్రైవేట్ ఆస్పత్రుల గణాంకాలు తీసుకుంటే ఈ సంఖ్య మరింత పెరగుతుంది. కాగా, కుక్కల సంతతి తగ్గించేందుకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తున్నామని పురపాలికల అధికారులు చెబుతున్నా వాటి సంతతి తగ్గకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
కొన్నేళ్లుగా జిల్లాలో కుక్కకాటు బాధితులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉపయోగించిన వ్యాక్సిన్
ఏడాది బాధితులు వాడిన
వ్యాక్సిన్ వాయిల్స్
2020 11,973 16,563
2021 13,120 16,947
2022 14,676 17,996
2023 14,492 20,392
2024 16,224 17,887
2025 10,895 12,889
(ఇప్పటివరకు)

బయటకొస్తే భయం... భయం