
వృత్తి నైపుణ్య శిక్షణ ప్రారంభం
ఖమ్మం రాపర్తినగర్: నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య రంగాల్లో ఇచ్చే శిక్షణ ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైంది. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనుండగా, ఇంకా ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను స్టేడియంలోని జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయంలో సంప్రదించాలని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల్లో శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వయస్సు, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పాస్‌పోర్టుతో దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌లో సంప్రదించాలని డీవైఎస్‌ఓ సూచించారు.
మధిర కాలేజీ ప్రిన్సిపాల్ కథకు అవార్డు
మధిర: మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జైదాస్ రాసిన ‘మరో గాలివాన’ కథకు ముల్కనూరు సాహితీ పీఠం అవార్డు దక్కింది. ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యాన జాతీయస్థాయి కథల పోటీలు నిర్వహించగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ దేశాల రచయితలు 417కథలను పంపించారు. ఇందులో 70కథలకు అవార్డులు ప్రకటించగా జాబితాలో జైదాస్‌కు సైతం స్థానం దక్కింది. అలాగే, మే 20న హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలుగు కార్టూనిస్టుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జైదాస్ రూపొందించిన కార్టూన్ల పుస్తకం ‘జాయ్ టూన్స్’ను సినీనటులు రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి ఆవిష్కరించారు.
నేడు కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం
ఖమ్మంమయూరిసెంటర్: సంస్థాగత నియామకాలపై చర్చించేందుకు ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు, బ్లాక్, మండల, పట్టణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరుకావాలని సూచించారు. శనివారం మధ్యాహ్నం 2గంటలకు మొదలయ్యే ఈ సమావేశంలో రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కార్యనిర్వాహకులు గంటా వినయ్, రాష్ట్ర సమన్వయకర్త మహ్మద్ జావేద్ తదితరులు హాజరవుతారని తెలిపారు.
ఎస్‌టీఎఫ్‌ఐ రజతోత్సవ పతాకావిష్కరణ
ఖమ్మం సహకారనగర్: ఎస్‌టీఎఫ్‌ఐ(స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రజతోత్సవాల సందర్భంగా ఖమ్మంలోని యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం పతాకాన్ని ఆవిష్కరించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు చావా దుర్గాభవాని పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నూతన జాతీయ విద్యావిధానం, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. నాయకులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ రాంబాబు పాల్గొన్నారు.
కుర్నవల్లి పీఏసీఎస్
పాలకవర్గం రద్దు
తల్లాడ: అవినీతి ఆరోపణల నేపథ్యాన మండలంలోని కుర్నవల్లి పీఏసీఎస్ పాలకవర్గాన్ని రద్దు చేస్తూ జిల్లా సహకార అదికారి గంగాధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కుర్నవల్లి సొసైటీ పరిధిలో రూ.2.50 కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం రైస్‌మిల్లు, దీనికి అనుబంధంగా రూ.52 లక్షలతో రేకుల షెడ్డు నిర్మించారు. అయితే, మే నెలలో వచ్చిన గాలిదుమారానికి షెడ్డు కూలిపోయింది. కాగా, నిర్మాణంలో పాలకవర్గం బాధ్యులు అవినీతికి పాల్పడ్డారని గ్రామానికి చెందిన కొందరు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డీసీఓకు ఫిర్యాదు చేశారు. ఈక్రమాన విచారణ అనంతరం 15 రోజుల క్రితం సీఈఓ ఒగ్గు నరసింహారెడ్డిని సస్పెండ్ చేయగా, ఇప్పుడు అయలూరి ప్రదీప్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న పాలకవర్గాన్ని రద్దు చేశారు. అలాగే, కుర్నవల్లి పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జిగా జి.శ్రీనివాస్ కుమార్‌ను నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.