
బాలలకు ఆపన్నహస్తం..
● తప్పిపోయిన, పారిపోయి వచ్చిన వారికి ఆర్పీఎఫ్ చేయూత
● చైల్డ్‌లైన్ సహకారంతో కౌన్సెలింగ్
● ఆపై తల్లిదండ్రుల దరికి చేరుస్తున్న వైనం
ఖమ్మంక్రైం:
●ఓ రోజు అర్ధరాత్రి పదో తరగతి చదివే బాలిక ఖమ్మం స్టేషన్‌లో రైలు దిగింది. కాసేపటికి 18ఏళ్ల బాలుడు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా ఆర్పీఎఫ్ సిబ్బంది గుర్తించి విచారించగా బాలికది ఒంగోలు అని తేలింది. ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన ఖమ్మం బాలుడిని కలిసేందుకు వచ్చానని చెప్పగా.. ఇద్దరికీ చైల్డ్‌లైన్ సిబ్బంది సహకారంతో కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
●వారం క్రితం ఆదిలాబాద్‌కు చెందిన ఓ బాలుడు, బాలిక ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తిరుగుతుండగా అనుమానంతో ఆర్‌పీఎఫ్ సిబ్బంది వివరాలు ఆరా తీశారు. తామిద్దరం ప్రేమించకున్నా పెద్దలు ఒప్పుకోక ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామని చెప్పారు. దీంతో ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించగా.. ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్, చైల్డ్‌లైన్ బాధ్యులకు వార కృతజ్ఞతలు తెలిపారు.
●ఐదు రోజుల క్రితం ఓ పదేళ్ల బాలుడు ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారని వరంగల్‌లో నుంచి రైలు ఎక్కి ఖమ్మం చేరుకున్నాడు. ఆ బాలుడు ప్లాట్‌ఫాంపై తిరుగుతుండగా ఆర్పీఎఫ్ సిబ్బంది చైల్డ్‌లైన్‌కు అప్పగించారు. దీంతో వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులను అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇలా ఒకటి కాదు రెండు నిత్యం ఖమ్మం రైల్వేస్టేషన్‌లో గస్తీ నిర్వహించే ఆర్‌పీఎఫ్ సిబ్బంది అమాయకులైన చిన్నారుల పాలిట ఆపద్భాంవుల్లా నిలుస్తున్నారు. కొందరు తప్పిపోయి వస్తుండగా.. రకరకాల కారణాలతో ఇంకొందరు ఇళ్లలో చెప్పకుండా వస్తున్నారు. మరికొందరు బాలికలు యువకుల మాయమాటలు నమ్మి వస్తుండడంతో తనిఖీల్లో భాగంగా ఆర్‌పీఎఫ్ సిబ్బంది చేరదీస్తున్నారు. చైల్డ్‌లైన్ సిబ్బంది సహకారంతో వారికి కౌన్సెలింగ్ ఇస్తూ మెల్లగా వివరాలు సేకరించి తల్లిదండ్రులకు అప్పగించి వారికి గర్భశోకం మిగలకుండా చూస్తున్నారు. కాగా, 2024సంవత్సరంలో 28మంది మైనర్లను కాపాడగా, ఈసంవత్సరం ఇప్పటివరకు 23మందిని కాపాడడం విశేషం.
తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి
మైనర్ల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చిన్న వయస్సులో మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దు. ఒకవేళ బయటకు వచ్చి నేరస్తుల కంట పడితే ప్రమాదం ఎదురవుతుంది. కొన్నిప్రాంతాల్లో తప్పిపోయి, పారిపోయి వచ్చిన పిల్లలను చేరదీసినట్లు నమ్మించి విక్రయించే అవకాశముంది. మా వంతుగా స్టేషన్‌లో నిరంతరం తని ఖీలు చేపడుతూ పిల్లలకు ఆపద ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నాం.
– బుర్రా సురేష్‌గౌడ్, ఆర్పీఎఫ్ సీఐ

బాలలకు ఆపన్నహస్తం..

బాలలకు ఆపన్నహస్తం..