
కన్నీరే మిగిలింది..
కట్లేరులో గల్లంతైన ముగ్గురు మృతి
ఎర్రుపాలెం: కుటుంబ పెద్దలను కట్లేరు మింగేసింది. తమ వాళ్లు బతికి ఉంటారని గంటల తరబడి ఆశగా ఎదురుచూసిన కుటుంబీకుల నిరాశే మిగిలింది. చేపల వేట పేరిట వెళ్లిన ముగ్గురు విగత జీవులుగా ఇళ్లకు చేరడంతో మండలంలోని బంజర గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు... మండలంలోని బంజరకు చెందిన పలువురు మీనవోలు బ్రిడ్జి వద్ద కట్లేరులో గురువారం చేపల వేటకు వెళ్లారు. అయితే, కట్లేరులో గుంతలను గుర్తించక, ఈత రాని కారణంగా బాదావత్ రాజు(55), భూక్యా కోటి(46), భూక్యా సాయి గల్లంతైన విషయం విదితమే. ఈమేరకు సమాచారం అందుకున్న అధికారులు రాత్రి పొద్దుపోయే వరకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో శుక్రవారం ఉదయం నుంచే గాలింపుమొదలుపెట్టగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈమేరకు ఘటనా స్థలంలో పంచనామా అనంతరం మృతదేహాలను మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం తర్వాత కుటుంబీకులకు అప్పగించారు. ఒకేరోజు గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంజర గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తుండడంతో గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, మార్కెట్ చైర్మన్ బండారు నర్సింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు బానోతు శ్రీను తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు.