
అన్ని సౌకర్యాలతో కార్యాలయాల సముదాయం
ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలానికి సంబంధించి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయాన్ని సకల సౌకర్యాలతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి గురువారం ఆయన తరుణీ హాట్ వద్ద సమీకృత మండల కార్యాలయాల సముదాయానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థల లభ్యత, కార్యాలయాల వివరాలపై ఆరా తీశాక మంత్రి మాట్లాడుతూ నిర్మాణ స్థలాన్ని చదును చేయించి పాతబడిన భవనాలను తొలగించాలని సూచించారు. మండల ప్రజల సౌకర్యార్ధం ఎంపీడీఓ, తహసీల్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ ఇలా అన్ని కార్యాలయాలు ఒకేచోట పూర్తిస్థాయి వసతులతో నిర్మించేలా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే, 30 ఫీట్ల రోడ్ల నిర్మాణం, సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి వసతి కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్‌డీఓ నర్సింహారావు, మార్కెట్ చైర్మన్ హరినాధ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.