
ముగ్గురిని మింగిన కట్లేరు?
● చేపల వేటకు వెళ్లగా గల్లంతు ● రాత్రి వరకు గాలించినా కానరాని ఫలితం
ఎర్రుపాలెం: రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబాలు.. వరదలో వేటాడితే చేపలు దొరుకుతాయనే భావనతో వెళ్లిన ముగ్గురు అదే వరదలో గల్లంతయ్యారు. అర్ధరాత్రి వరకు గాలింపు చేపట్టిన వారి జాడ తెలియరాకపోవడంతో మూడు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
ఈత రాక.. గుంతలు తెలియక
ఎర్రుపాలెం మండలం బంజర గ్రామానికి చెందిన బాదావత్ రాజు(55), భూక్యా కోటి(46), భూక్యా సాయితో పాటు మరో ఐదుగురు గురువారం చేపలు పట్టడానికి మీనవోలు బ్రిడ్జి వద్ద కట్లేరుకు వెళ్లారు. అంతా కలిసి చేపలు పట్టేందుకు అనువుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకున్నారు. కట్లేరులో వరద ప్రవాహం పెద్దగా లేకపోయినా పలుచోట్ల దాదాపు 20 అడుగుల లోతు మేర గుంతలు ఉన్నాయి. దీంతో అంతా ఒకే చోట వలలు విసురుతూ చేపల వేట మొదలుపెట్టాక రాజు, కోటి, సాయి ఈత రాని కారణంగా గుంతల్లో మునిగిపోయారు. దీంతో ఈత వచ్చిన మిగతా ఐదుగురు వారి కోసం గాలించినా ఫలితం లేక బాధిత కుటుంబీకులకు, ఆపై అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు వైరా ఏసీసీ రహమాన్, మధిర సీఐ డి.మధు, ఎస్‌ఐ ఎం.రమేష్, తహసీల్దార్ ఎం.ఉషాశారద చేరుకుని ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పిలిపించి రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా ఫలితం కానరాలేదు. కాగా, ముగ్గురు గల్లంతైన విషయం తెలియగానే వారి కుటుంబీకులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. రాత్రి వరకు కూడా వారి జాడ తెలియకపోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మళ్లీ శుక్రవారం ఉదయమే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో గాలింపు మొదలుపెడతామని అధికారులు వెల్లడించారు.