
నాట్లు వేస్తుండగా గుండెపోటుతో రైతు మృతి
కొణిజర్ల: వరి నార్లు వేస్తుండగా గుండెపోటు రావడంతో ఓ రైతు మృతి చెందాడు. కొణిజర్లకు చెందిన బండారు పుల్లయ్య(63) గురువారం తన పొలంలో నారు కట్టలు పరిచేందుకు వెళ్లాడు. నార్ల కట్టలు మోస్తుండగా గుండెపోటుకు గురైన ఆయన కన్నుమూశాడు. పుల్లయ్యకు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, సీపీఐలో కొనసాగుతున్న ఆయన మృతదేహం వద్ద జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు గడల భాస్కర్, ఎర్రా బాబు, దొండపాటి రమేష్, స్వర్ణ రమేష్, తోటపల్లి సీతారాములు, తాటి వెంకటేశ్వర్లు, తాటి నిర్మల, లతాదేవి, కళావతి నివాళులర్పించారు.
విద్యుదాఘాతంతో మహిళ...
కారేపల్లి: ఆరవేసిన దుస్తులు తీసే క్రమాన విద్యుదాఘాతానికి గురైన మహిళ మృతి చెందింది. కారేపల్లి మండలం విశ్వనాథపల్లికి చెందిన బొగ్గారపు సరస్వతి(52) ఇంటి రేకుల షెడ్డులో కట్టిన జీ వైర్‌పై దుస్తులు ఆరేసింది. అయితే, షెడ్డు మీదుగా విద్యుత్ వైర్ వెళ్లడంతో జీ వైర్ గుండా విద్యుత్ ప్రసారమవుతున్నట్లు తెలిసింది. ఈమేరకు దుస్తులు తీసే క్రమాన సరస్వతి విద్యుదాఘాతానికి గురికాగా బట్టలు గట్టిగా లాగడంతో జీ వైరు తెగి మెడకు చుట్టుకుని తప్పించుకోలేక అక్కడే కుప్పకూలింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేసి పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందింది. సరస్వతికి భర్త కిషన్‌రావు, ఓ కుమారుడు ఉన్నాడు.
జేసీబీ, ట్రాక్టర్లు సీజ్
కామేపల్లి: అనుమతి లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు నాలుగు ట్రాక్టర్లను పోలీసులు గురువారం సీజ్ చేశారు. కామేపల్లిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శివార్లలో ప్రభుత్వ భూమి నుంచి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారని గుర్తించారు. ఈమేరకు జేసీబీ, ట్రాక్టర్లను సీజ్ చేసి తదుపరి విచారణ కోసం రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.