
ఎప్పుడవుతుందో..?
అటవీ పార్క్
ఎర్రుపాలెం: మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిధుల మంజూరులో వేగం చూపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పనులు అంతే వేగంగా జరగడం లేదు. ఫలితంగా అధికార యంత్రాంగం తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. తెలంగాణ తిరుమలగా పేరున్న ఎర్రుపాలెం మండలంలోని జమలాపురంను పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం అటవీ పార్క్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా పనుల్లో కదలిక లేక శిలాఫలకం అధికారుల తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
రూ.5.83 కోట్లు.. జనవరిలో శంకుస్థాపన
శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయం కొలువైన జమలాపురం గ్రామంలో పర్యాటక అభివృద్ధి కోసం అడవులు, గుట్టల ఆధారంగా ఎకో అటవీ పార్కు నిర్మాణానికి (పర్యావరణ ఉద్యానవనం) కార్యాచరణ రూపొందించారు. రూ.5.83 కోట్ల నిధులు మంజూరు కాగా, డిప్యూటీ సీఎం భట్టి జనవరి 7న శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పనులు నత్తనడకన సాగుతున్నాయి. అడవులను ధ్వంసం చేయకుండా, వీటి ఆధారంగా కాటేజీల నిర్మాణం.. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోగా.. ఆరు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కానీ, ఆ గడువు ముగిసినా అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం.
చేపట్టాల్సిన పనులు ఇవే..
అటవీ పార్కు నిర్మాణంలో భాగంగా అధికారులు పలు అభివృద్ధి పనులను చేపట్టాల్సి ఉంది. గుట్ట కింద మొత్తం ఐదు టాయెలెట్ల నిర్మాణం, గుట్టపైన ఉన్న శ్రీవారి పాదాల వరకు రహదారి మార్గం ఏర్పాటు చేయాలి. అలాగే, గుట్టపైకి దారితో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు, సైడ్ వాల్స్ నిర్మాణం పనులు, టూరిస్టులు విడిది చేసేందుకు గానూ మూడు కాటేజీలు నిర్మించాల్సి ఉంది. అంతేకాక గుట్టపై పర్యాటకుల కోసం పార్క్‌ల ఏర్పాటు, టూరిస్టులు ఒకేచోట సేద తీరడం, కూర్చునేందుకు హట్స్ నిర్మించాల్సి ఉంది.
జమలాపురంలో కదలిక లేని పనులు
నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం
పర్యాటక అభివృద్ధి అవకాశాలపై
పట్టింపు కరువు
పార్క్ సిద్ధమైతే పర్యాటకుల తాకిడి
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి అన్ని ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. అటవీ పార్కు పూర్తయితే పర్యాటకుల తాకిడి మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఆదాయ మార్గాలుంటాయి. యువతకు ఉపాది కూడా ఉంటుంది. గుట్టపైన కాటేజీల నిర్మాణంతో టూరిస్టులు విడిది చేయడానికి కూడా మొగ్గు చూపుతారు. గుట్టపైన శ్రీవారి పాదాల వద్దకు కూడా భక్తులు వెళ్లి సందర్శించి పూజలు నిర్వహిస్తున్నారు.
–ఉప్పల శ్రీరామచంద్రమూర్తి,
వ్యవస్థాపక ధర్మకర్త, జమలాపురం ఆలయం
గుట్ట కింద పనులు చేస్తున్నాం..
జమలాపురంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయం సమీపంలో 4,5 హెక్టార్లల్లో అటవీ పార్కు పనులు మొదలుపె ట్టాం. ఇప్పటికే టాయ్‌లెట్ల పనులు జరుగుతున్నాయి. గుట్ట కింద ఎర్త్ పనులు కూడా చేస్తున్నాం. నిధులు మంజూరైనప్పటికీ ఇంకా కాంట్రాక్టర్‌కు అసలు బిల్లులు రాలేదు. ఈ కారణంగా పనులు మందకొడిగా నడుస్తున్నాయి. బిల్లులు సకాలంలో వస్తే పనులు వేగం పుంజుకుంటాయి.
–శ్రీనివాసరెడ్డి, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, మధిర

ఎప్పుడవుతుందో..?

ఎప్పుడవుతుందో..?