
గురుకుల కార్యదర్శికి నిరసన సెగ
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా పర్యటనలో భాగంగా ఖమ్మం వచ్చిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణికి వామపక్ష విద్యార్థి సంఘాల నుంచి నిరసన సెగ ఎదురైంది. బుధవారం ఖమ్మంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమెకు వినతిపత్రం అందించేందుకు ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ సంఘాల నేతలు కళాశాల వద్దకు చేరుకున్నారు. వారిని కలిసేందుకు నిరాకరించడంతో గురుకులాల కార్యదర్శి కారును కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్థానిక అధికారులు మెయిన్ గేటు నుంచి కాకుండా పక్కనున్న గేటు ద్వారా లోనికి తీసుకెళ్లగా ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అంబేద్కర్ కళాశాలలో కార్యక్రమం ముగించుకొని దానవాయిగూడెం గురుకులం వద్దకు వెళ్లిన విషయం తెలుసుకుని అక్కడా వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కార్యదర్శి కారుకు అడ్డుపడి ఆందోళన చేశారు. ఆందోళన ఉధృతం అవుతుండగా పోలీసులు చేరుకొని వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. సమస్యలు వింటేనే ఆందోళన విరమిస్తామని సంఘాల నేతలు పట్టుబట్టడంతో పోలీసులు జోక్యం చేసుకొని గురుకుల కార్యదర్శికి వినతిపత్రం అందజేయించారు. సమస్యలు వినకుండా గురుకుల కార్యదర్శి వ్యవహరించిన తీరుపై విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వినలేని గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణిని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనంతరం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవనంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, జార్జిరెడ్డి పీడీఎస్‌యూ, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శులు ఇటికాల రామకృష్ణ, టి.ప్రవీణ్‌కుమార్, వి.వెంకటేశ్, ఎం.సురేశ్, జి.మస్తాన్ మాట్లాడారు. తొలి నుంచి గురుకుల కార్యదర్శి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఓ సందర్భంలో విద్యార్థులు బాత్‌రూమ్‌లు కడుక్కోలేరా అని మాట్లాడారని, ఇప్పుడు విద్యార్థుల సమస్యలను వివరించేందుకు వెళ్లిన తమతో మాట్లాడేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. సమావేశంలో సుధాకర్, త్రినాథ్, మనోజ్, అజయ్, లోకేశ్, వెంకటేశ్, జంపన్న, వరుణ్, వెంకట్ పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల సందర్శన
ఖమ్మంరూరల్: మండలంలోని కోదాడక్రాస్‌రోడ్‌లోని టీజీఎస్‌ఈడబ్ల్యూఆర్‌ఎస్‌ను గురుకులాల కార్యదర్శి అలుగు వర్శిణి బుధవారం సందర్శించారు. పదో తరగతి విద్యార్థులను పలు సబ్జెక్టులపై ప్రశ్నించారు. పరిశుభ్రత, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు.
కారుకు అడ్డుపడి ఆందోళన చేసిన
విద్యార్థి సంఘాల నేతలు