
జీవనోపాధికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..
ఖమ్మంమయూరిసెంటర్: బొగ్గు గనులు మూసేసిన ప్రాంతాల్లో అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనోపాధికి ఏం చర్యలు చేపడుతున్నారు..? అని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ఎంపీ మూడు ప్రశ్నలు అడిగారు. బొగ్గు గనులకు సంబంధించి జస్ట్ ట్రాన్సిషన్ పనితీరును మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు, మరో రెండు ప్రశ్నల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వివరాలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు తీరు, రేషన్ కార్డుల జారీ వివరాలు కోరారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి, విద్యుత్, కొత్త పునరుత్పాదక ఇంధనం శాఖల సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్, కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్‌బాంభణియా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 31న జారీ చేసిన మైనింగ్ ప్లాన్ గనుల మూసివేత మార్గదర్శకాల ప్రకారం.. ప్రభావిత కుటుంబాల కోసం పునరావాస చర్యలు చేపడుతున్నామని జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శ్రీపాద్‌యశోనాయక్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన అమలు సంస్థలు (ఆర్‌ఈఐఏఎస్) జారీ చేసిన టెండర్లకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఐ), ఎన్‌టీపీసీ తదితర సంస్థలతో కలుపుకుని ఈ ఏడాది జూన్ 30వ తేదీ నాటికి 43,922 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ అమ్మకపు ఒప్పందా (పీఎస్‌ఏఎస్)లను కేంద్రం వేగవంతం చేసిందన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం అమలు తీరుపై కేంద్ర సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభణియా సమాధానం ఇస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో 75 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50 శాతం వరకు జనాభా ఆహార అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
లోక్ సభలో మూడు ప్రశ్నలు అడిగిన
ఎంపీ రఘురాంరెడ్డి