
అంతా సాఫీగా సాగుతోందా?
● గురుకులాలు, హాస్టళ్లు, కేజీబీవీల్లో అధికారుల తనిఖీలు ● హాజరు, సౌకర్యాల పరిశీలన... మెనూ అమలుపై సర్వే ● మండల, మున్సిపల్ అధికారులతో బృందాల ఏర్పాటు
ఖమ్మంమయూరిసెంటర్: ప్రభుత్వ సంక్షేమ గురుకులాలు, వసతి గృహాలతో పాటు కస్తూర్భాగాంధీ విద్యాలయాల్లో విద్యార్థులకు వసతులు, సౌకర్యాలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతీ జిల్లాలో ఐఏఎస్ అధికారులు ఒక దఫా తనిఖీ చేపట్టగా.. మరోసారి పూర్తి స్థాయిలో తనిఖీ చేపట్టాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈమేరకు జిల్లాలోని ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలు, వసతిగృహాలతో పాటు కేజీబీవీల్లో తనిఖీల కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లాలో గురుకులాలు, వసతిగృహాలు, కేజీబీలు అన్నీ కలిపి 181 ఉండగా.. వీటిలో తనిఖీకి అధికారులను నియమిస్తూ అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఉత్తర్వులు జారీ చేశారు. బుధ, గురువారం తనిఖీ చేయాలని ఆదేశించగా కొన్నిచోట్ల అధికారులు ముందుగానే ప్రారంభించారు.
అధికారులతో బృందాలు
జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోని గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీల్లో తనిఖీ కోసం మండల, మున్సిపల్ అధికారులను నియమించారు. మండలాల నుంచి తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఈఓలను నియమించగా.. మున్సిపాలిటీల నుండి కమిషనర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అసిస్టెంట్ కమిషనర్, ఇంజీనీర్లు, ఉద్యాన అధికారికి బాధ్యతలు అప్పగించారు. వీరు తమకు కేటాయించిన విద్యాసంస్థల్లో బుధవారం, గురువారం తనిఖీ చేయాల్సి ఉంటుంది.
ఏమేం పరిశీలిస్తారంటే...
తనిఖీ సమయంలో అధికారులు ప్రధానంగా ఏడు అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం, వసతి గృహాల్లోని పడకలు, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదులు వంటి కనీస సౌకర్యాల లభ్యతను పరిశీలిస్తారు. ఇవన్నీ విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉన్నాయా, లేదా అని చూడడమే కాక భవనాలు, ప్రహరీ గోడలు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక సదుపాయాల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేస్తారు. ఎక్కడైనా మరమ్మతులు అవసరమా, భద్రతాపరమైన లోపాలు ఉన్నాయా అని కూడా పరిశీలించడమే కాక వంటశాలలు, దోమల నివారణ చర్యలు, తాగునీటి శుభ్రత, వ్యర్థాల నిర్వహణపైనా ఆరా తీస్తారు. ఇదే సమయాన విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేస్తారు. అంతేకాక విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠ్య ప్రణాళిక అమలు, ఉపాధ్యాయుల హాజరు, బోధనా నాణ్యత ఆరా తీయనున్నారు. ఆయా అంశాల్లో ఏదైనా సమస్యలు, ఫిర్యాదులను గుర్తిస్తే విచారణ చేపడుతారు.
నివేదికలు..
అధికారులు విద్యాసంస్థల్లో తనిఖీ సమయాన గుర్తించే అంశాలన్నింటినీ గూగుల్ ఫామ్(ఆన్‌లైన్)లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆపై ఆగస్టు 1న నివేదికలను శాఖల వారీగా ఉన్నతాధికారులకు సమర్పించారు. ఇందులోని అంశాల ఆధారంగా తీసుకునే చర్యలను వారు 4వ తేదీన కలెక్టర్‌కు అందించాల్సి ఉంటుంది.

అంతా సాఫీగా సాగుతోందా?