
మళ్లీ రాజుకుంటున్న పోడు వివాదం
● ఏళ్లుగా పట్టాలకు నోచుకుని ఎల్లన్ననగర్ వాసులు ● ఫలితంగా ప్రతీ వానాకాలం గొడవలే
కొణిజర్ల: కొణిజర్ల మండలంలో ఉన్న కాస్తంత అడవిని రక్షించాలని అటవీ అధికారులు... ఏళ్లుగా సాగు చేసకుంటున్నందునతమకు పట్టాలు ఇవ్వాలని పోడుదారులు పోటీ పడుతుండడంతో ఏటా ఘర్షణలు సర్వసాధారణమయ్యాయి. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలో బేస్‌మెంట్ క్యాంప్ 58లో దాదాపు 490 హెక్టార్లలో అటవీ భూమి విస్తరించి ఉండేది. కొన్నేళ్లుగా ఈ భూమిలో పలువురు పోడు కొట్టి సాగు చేసుకుంటున్నారు. పదేళ్ల క్రితం వివిధ గ్రామాల నుంచి 200కుటుంబాల అటవీ ప్రాంతానికి సమీపానే ఎన్నెస్పీ కాల్వ పక్కన గుడిసెలు వేసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో గుబ్బగుర్తి, విక్రమ్‌నగర్, జంపాలనగర్, క్రాంతినగర్, సాలెబంజర, మెకాలకుంట, లక్ష్మీపురం తదితర గ్రామాల ప్రజలకు పట్టాలు అందాయి. ఆపై బీఆర్‌ఎస్ వచ్చాక కూడా కొందరికి పట్టాలు ఇచ్చారు.
ఆ తర్వాత పోడు కొట్టారని...
ఎల్లన్ననగర్ వాసులు 2008 తర్వాత పోడు చేశారని అటవీ అఽధికారులు కొత్తగా ఎవరికీ పట్టాలు ఇవ్వడం లేదు. కనీసం ఎవరికి ఎంత భూమి ఉందో సర్వే చేయించలేదు. ఈక్రమాన 490 హెక్టార్లలో 450హెక్టార్ల అడవి అన్యాక్రాంతం కాగా, మిగిలిన భూమిని కాపాడుకోవాలనేది తమ ప్రయత్నంగా అటవీ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయాన ఎల్లన్ననగర్ వాసులు మిగిలిన భూమిని సైతం దున్నుతున్నారని ఆంక్షలు పెడుతున్నారు. అయితే, అనుమతించిన భూమిలోనే పంటలు సాగు చేస్తుండగా అధికారులు మొక్కలను తొలగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈనెల 19న కూడా ఓ రైతు పొలంలో పత్తి మొక్కలు తొలగించగా ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ఎల్లన్ననగర్‌లో పోడు సమ స్య నానాటికీ తీవ్రమవుతున్నందున అధికారులు, ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ఏటా మరింత లోనకు వస్తున్నారు...
ఎల్లన్ననగర్ ప్రాంతంలో 24 హెక్టార్ల అడవే మా ఆధీనంలో ఉంది. దీన్ని కాపాడుకునేలా మొక్కలు నాటిస్తుంటే పోడు సాగుదారులు ఏటా కొంత చొప్పున చదును చేస్తున్నారు. అనుమతి ఉన్నంత మేర సాగు చేసుకోవాలని సూచించినా వినడం లేదు. జంతువులు నీళ్లు తాగేందుకు ఏర్పాటు చేసిన పిట్లను కూడా పగలగొట్టారు. దీంతో మొక్కలు నాటించడానికి వెళ్లాం తప్ప ఎవరి పంట తొలగించలేదు.
– ఉపేంద్రయ్య, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్, కొణిజర్ల