
సీజనల్ వ్యాధుల కట్టడిపై దృష్టి
బోనకల్/చింతకాని: మారిన వాతావరణ పరిస్థితుతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. బోనకల్‌లో డెంగీ కేసు నమోదైన నేపథ్యాన మంగళవారం ఆమె పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఓపీకి వస్తున్న వారి వివరాలు, అందుతున్న చికిత్స, మందుల లభ్యతపై ఆరాతీశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ప్రజలకు పరిశుభ్రతపై సూచనలు చేశారు. ఆతర్వాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎన్‌ఎస్పీ కెనాల్‌లో ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారం పడి ఉండడంతో త్వరగా శుభ్రం చేయించాలని సూచించారు. వైద్యాధికారి స్రవంతి, ఉద్యోగులు దానయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. అలాగే, చింతకాని, నాగులవంచలోని ఆరోగ్య కేంద్రాలను కూడా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యసిబ్బందికి సూచనలు చేశారు. పారిశుద్ధ్య పనులు, డ్రై డే నిర్వహణ, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేయించాలని తెలిపారు. అనంతరం రేపల్లెవాడలో వైద్య శిబిరాన్ని పరిశీలించి ఇంటింటా సర్వేపై సూచనలు చేశారు. వైద్యులు అల్తాఫ్, వేణుమాధవ్, ఉద్యోగులు వీరేందర్, కృష్ణారావు, లక్ష్మి, దైవమ్మ, సుజాత, పద్మ పాల్గొన్నారు.