
ఉండలేక.. కట్టలేక !
పక్కా ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు
● ఆంక్షలతో అడ్డుపడుతున్న అటవీ అధికారులు ● గుడిసెల్లో ఉండలేక తుమ్మలనగర్ గిరిజనుల అవస్థలు ● ఇందిరమ్మ ఇళ్లు వచ్చినా అడ్డుకుంటున్నారని ఆగ్రహం
సత్తుపల్లి: ముప్‌పై ఏళ్లుగా గుడిసెల్లోనే జీవితం.. తాగునీళ్లు లేవు.. రోడ్లులేవు.. దోమలు, ఈగలతోనే సావాసం చేయాల్సిన దుస్థితి.. కరెంట్ కోసం తిరి గితే సత్తెమ్మతల్లి గుడి నుంచి ఒక లైను వేశారు.. ఈ కష్టాలన్నీ ఓ కొలిక్కి రాగా, గుడిసెల్లో ఉండలేని పరి స్థితి ఎదుర్కొంటున్న తమను అటవీ అధికారులు మరింత ఇబ్బంది పెడుతున్నారని సత్తుపల్లి మండలం చెరుకుపల్లి పంచాయతీ తుమ్మలనగర్ గిరిజనులు వాపోతున్నారు. ఇక్కడ సుమారు 50 గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో తుమ్మలనగర్ వెనుకాల మూడు కి.మీ. దూరంలో అటవీప్రాంతంలో ఉండేది. రవాణా, విద్యుత్, రోడ్డు, మంచినీటి సౌకర్యాలు లేకపోవటంతో చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 22లో 11 ఎకరాలలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇవి కూడా వర్షానికి తడుస్తున్నాయి.. కప్పుకుందామన్నా ఆంక్షలతో అడ్డుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు.
ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉన్నా..
ఎన్నో ఆందోళనలు, విజ్ఞప్తులు, పోరాటాల ఫలితంగా 48 కుటుంబాలకు ప్రభుత్వం 2022లో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను అందించింది. గుడిసెలో ఉంటున్న ప్రదేశాన్ని లెక్కకట్టి ఒక్కోక్కరికి రెండు, మూడు, నాలుగు కుంటలు చొప్పున పట్టాలను రెవెన్యూ, అటవీశాఖ అందించింది. అయితే ఇళ్లను బాగు చేయించటం కానీ.. నూతనంగా నిర్మించటం కానీ.. రేకులు వేయించుకోవటం కానీ చేసుకోవటం కుదరదని అటవీశాఖ మెలిక పెడుతుంది. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా ఉద్దేశం సాగు చేసుకోవాలని ఉందని.. కుంట, రెండు కుంటల్లో సాగు ఎలా చేస్తారంటూ గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నట్టు రికార్డుల్లో నమోదు చేసుకొని ఇప్పుడు ఇళ్లు బాగు చేసుకోవద్దంటూ ఎలా అంటూ నిలదీస్తున్నారు. అదీగాక 150 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు.
●నిర్మాణాలు అడ్డగింత
చెరుకుపల్లి పంచాయతీ పరిధిలోని తుమ్మలనగర్‌కు చెందిన తాటి వీరభద్రం, ఊకే రత్తమ్మలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. తాటి వీరభద్రం ముగ్గు వేస్తుండగానే అటవీశాఖ సిబ్బంది నిలిపివేసింది. ఊకే రత్తమ్మ పునాదుల వరకు నిర్మించిన పనులను నిలిపివేశారు. తుమ్మలనగర్‌లో నివాసం ఉంటున్న 48 కుటుంబాలలో ఒక్కొక్కరి గుడిసెలో ఇద్దరేసి, ముగ్గురేసి కుటుంబాలు ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఎలా అడ్డుకుంటారంటూ గిరిజనులు వాపోతున్నారు. అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా జాయింట్ సర్వే చేస్తే చెరుకుపల్లి సర్వే నంబరు 22లోని భూమి రెవెన్యూ భూమిగా తేలుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ముగ్గు వేయగానే నిలిపివేశారు..
ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందని సంబరపడ్డాం. ఇంటి నిర్మాణం కోసం ముగ్గు వేశాం. అటవీశాఖ సిబ్బంది వచ్చి నిలిపివేశారు. ఇల్లు కట్టుకోవటం కుదరదని చెప్పి వెళ్లారు. మా గుడిసెలో ఇప్పటికే మూడు కుటుంబాలు ఉంటున్నాం.
– తాటి సారిక, తుమ్మలనగర్
అది అటవీశాఖ భూమే..
చెరుకుపల్లి పంచాయతీలోని తుమ్మలనగర్ అటవీశాఖకు చెందిన భూమి. దీంట్లో ఎలాంటి పక్కా నిర్మాణాలకు అనుమతులు లేవు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చట్టాలు ఉన్నాయి. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల ఉద్దేశం ఇంటి నిర్మాణాలు చేపట్టకూడదు. – వాడపల్లి మంజుల, ఎఫ్‌డీఓ, సత్తుపల్లి

ఉండలేక.. కట్టలేక !

ఉండలేక.. కట్టలేక !

ఉండలేక.. కట్టలేక !