
‘రైల్ వన్’ లాభాలెన్నో..
● ప్రయాణికులకు అందుబాటులో రైల్ వన్ యాప్ ● జూలై 1 నుంచి సేవలు అమల్లోకి..
వైరా: రైలు ప్రయాణమంటే ఒక ప్రహసనమే.. ప్రస్తుతం రైల్వే శాఖ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి రైల్ వన్ అనే యాప్ ను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ప్రయాణికులకు కావాల్సిన సమాచారం అంతా ఒకే యాప్‌లో లభిస్తుందని ఇండియన్ రైల్వే శాఖ చెబుతోంది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
●టికెట్‌కు ఇబ్బంది లేదు..
ఈ యాప్ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. అత్యవసరంగా అన్ రిజర్వు టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందవచ్చు.
●రైళ్ల కోసం..
మనం వెళ్లాల్సిన ప్రాంతానికి ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రెయిన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్‌పై రైలు ఆగుతుంది? కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది? ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రెయిన్ ద్వారా తెలుసుకోవచ్చు.
●రిజర్వేషన్ ఇలా..
ఇందులో పీఎన్‌ఆర్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ట్రెయిన్ క్యాన్సిల్, రిజర్వేషన్ క్యానిల్ వంటి అంశాలను కూడా ఇందులో తెలుసుకోవచ్చు.
●సీటు వద్దకే ఆహారం..
మనకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకునేలా అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునే ముందే మనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే మీరు ప్రయాణిస్తున్న ట్రెయిన్‌లో మీసీటు వద్దకే తెచ్చి ఇచ్చే సౌకర్యం ఉంది.
సూచనలు, ఫిర్యాదులు..
రైల్వే శాఖకు ఏమైనా సూచనలు ఇవ్వాలి అనుకున్నా.. ట్రెయిన్‌లో ప్రయాణించే సమయంలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదు చేయడానికి ఇదే యాప్‌లో రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఫిర్యాదు చేసిన కొద్ది సమయంలోనే రైల్వేశాఖ సిబ్బంది సమస్యకు పరిష్కారం చూపుతారు.
డౌన్‌లోడ్ ఇలా..
మొబైల్ ఉపయోగించే వారికి ఎంతో ఉపయోకరంగా ఉండే ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాపిల్, ఐఓఎస్, యాపిల్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత సెల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్‌వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది.