
బైక్‌ను ఢీకొట్టిన లారీ
కామేపల్లి: బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన ముచ్చర్ల క్రాస్ రోడ్డు సమీ పంలో ఆదివారం చోటుచేసుకుంది. సింగరేణి మండ లం గిద్దవారిగూడెంనకు చెందిన గుగులోత్ రాజశేఖర్, రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన కేలోత్ మంగీలాల్ బైక్‌పై ఖమ్మం వైపు వెళ్తుండగా ముచ్చర్ల క్రాస్ రోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పేకాట స్థావరాలపై దాడి
కారేపల్లి: పేకాట స్థావరాలపై కారేపల్లి పోలీసులు దాడి చేసి 12 మందిని అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎస్‌ఐ బి.గోపి ఆధ్వర్యంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉసిరికాయపల్లి శ్రీకోటమైసమ్మతల్లి ఆలయ సమీపంలోని గుట్టల్లో పేకాట ఆడుతున్నారని సమాచారం అందింది. ఈ క్రమంలో పేకాట స్థావరాలపై దాడి చేసి ఇల్లెందు పట్టణానికి చెందిన 12 మందిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 6 ద్విచక్రవాహనాలు, 9 సెల్‌ఫోన్లు, రూ.25,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో కానిస్టేబుళ్లు భూక్య శంకర్, హరి, ఓంకార్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతున్న వివాహిత మృతి
రఘునాథపాలెం: గడ్డిమందు సేవించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత మృతి చెందిన ఘటన రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ కథనం ప్రకారం.. డోర్నకల్ మండలం తోడేళ్లగూడేనికి చెందిన అల్లి ఉమ కుమార్తె స్వాతికి మూడేళ్ల కిందట రామకృష్ణతో వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల పాప ఉంది. వివాహానికి ముందే స్వాతి కడుపునొప్పితో బాధపడుతుండగా పెళ్లి తరువాత తలనొప్పి కూడా ప్రారంభమై ఇబ్బంది పడుతోంది. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల 30న ఇంట్లో గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. మృతురాలి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.