
మెరుగైన సేవలతో బ్యాంకు అభివృద్ధి
ఖమ్మంగాంధీచౌక్: ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించటం ద్వారా బ్యాంకు అభివృద్ధి పథంలో నిలుస్తుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు అన్నారు. భద్రాద్రి అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ 28వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక వాసవి కల్యాణ మండపంలో బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వరరావు తొలుత వాసవీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సాంకేతిక విధానాలను పాటిస్తూ ఖాతాదారులకు ప్రయోజనకరమైన సేవలు అందిస్తే బ్యాంకు మరింతగా విస్తరిస్తుందని తెలిపారు. జిల్లా సహకార అధికారి గంగాధర్ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో సహకార వ్యవస్థ కీలకమని, అన్ని వర్గాల ప్రజలకు సహకార రంగాలు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ కృష్ణమూర్తి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను వినిపించారు. అంతేగాక 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. గడిచిన ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాంకు రూ.598.96 కోట్ల డిపాజిట్లను కలిగి ఉందని, రూ.365.99 కోట్లను పలు రూపాల్లో రుణాలుగా ఇచ్చామని, ఈ ఏడాది నూతనంగా 6 శాఖలను ప్రారంభించి మొత్తం 23 శాఖలతో వినియోగదారులకు సేవలందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకుగా అనుమతులు పొందిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్‌లు సన్నె ఉదయ్‌ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు, డైరెక్టర్లు దేవత రాజారావు, బలుసు సాంబమూర్తి, మద్ది పిచ్చయ్య, రాజ్ పురోహిత్ చైన్‌సింగ్, వైవీఎస్ రావు, రంగానాగా శ్రీనివాసరావు, దారా జీవన్‌రాం, కర్లపూడి నర్మద, కిలవాయి జయప్రద, బోర్డ్ మేనేజ్‌మెంట్ సభ్యులు సీజీ శాస్త్రి, పైడిమర్రి సత్యనారాయణ, ప్రొఫెసర్ పసుమర్తి మధుసూదన్‌రావు, బ్యాంకు అన్ని శాఖల మేనేజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
భద్రాద్రి బ్యాంక్ 28వ వార్షికోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తి రాజేశ్వరరావు