
శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తెల్లవారుజామునే స్వామి మూలవిరాట్‌తో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదానికిఅర్చకులు పంచామృతంతో అభిషేకాలు చేశారు. అలాగే, పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన స్వామి, అమ్మవార్ల నిత్యకల్యానం, పల్లకీసేవ నిర్వహించారు. కాగా, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా రాగా అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజలు చేయించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సూపరింటెండెంట్ విజయకుమారి, అర్చకులు రాజీవ్‌శర్మ, మురళీమోహన్‌శర్మ పాల్గొన్నారు.
ప్రజలకు భరోసా
కల్పించాలి
బోనకల్: సమస్యలతో వచ్చే ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసుల పనితీరు ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. బోనకల్ పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేసిన ఆయన స్టేషన్ నిర్వహణ, ఉద్యోగుల పనితీరు, పెండింగ్ కేసుల విచారణపై ఆరాతీశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ పెట్రోకార్, బీట్ సిబ్బంది విధినిర్వహణలో చురుగ్గా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే, పాత నేరస్తుల కదలికలపై నిఘా వేయాలని, రెండు రాష్ట్రాల సరిహద్దులో అక్రమ రవాణా నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేట్టాలని సీపీ తెలిపారు. ఎస్‌ఐ పొదిలి వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్సీ న్యాయవాద
పట్టభద్రులకు ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల న్యాయవాద పట్టభద్రులకు ఉచిత శిక్షణతో పాటు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన ఈ పథకానికి గాను ఉమ్మడి జిల్లాలోని అర్హులైన న్యాయవాద పట్టభద్రులు ఈనెల 31లోగా ఈ–పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కె.సత్యనారాయణ సూచించారు. ఎంపికై న వారికి మూడేళ్ల పాటు సివిల్, క్రిమినల్ లాలో ఉచిత శిక్షణతో పాటు పుస్తకాలు, స్టేషనరీ కోసం రూ.50వేలు, నెలకు రూ.3వేల ఉపకార వేతనం, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ లభిస్తాయని తెలిపారు. రూ.2 లక్షల లోపు ఆదాయం కలిగిన వారు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, మార్కుల జాబితాలు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.
హైవే భూసేకరణకు
నోటిఫికేషన్
ఖమ్మం అర్బన్: నాగపూర్ – అమరావతి జాతీయ రహదారి(163జీ) విస్తరణలో భాగంగా జిల్లాలో అవసరమైన భూసేకరణకు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ నుంచి ఖమ్మం వరకు జిల్లాలోని 203.8 కి.మీ. నుంచి 220.48 కి.మీ మధ్య పాయింట్లలో భూములు సేకరించనున్నారు. ఈమేరకు ఖమ్మం రూరల్ మండలం తీర్థాల రెవెన్యూ పరిధి పది సర్వే నంబర్లు, ఒక డొంక రహదారి, రఘునాథపాలెం మండలంలోని రఘునాథపాలెం, వేపకుంట్ల, వి.వెంకటాయపాలెం గ్రామాల్లో పదికి పైగా సర్వే నంబర్ల పరిధిలో భూముల సేకరణకు గుర్తించారు. మొత్తంగా 5.978 హెక్టార్ల భూమి సేకరిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లోగా ఖమ్మం ఆర్డీఓకు లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించారు. ఆపై అభ్యంతరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని నోటిఫికేషన్ వెల్లడించారు.

శ్రీవారికి అభిషేకం, నిత్యకల్యాణం