
వరదలు ఎదుర్కొనేలా అప్రమత్తత
● యూరియా అక్రమ రవాణా కట్టడిపై దృష్టి ● ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్రమోహన్
ఖమ్మంమయూరిసెంటర్: భారీ వర్షాల నేపథ్యాన వరద ముంపు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ ఆదేశించారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన శనివారం హైదరాబాద్ నుండి వీసీ ద్వారా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, మున్నేటి వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలే కాక ఆపదమిత్ర వలంటీర్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇక యూరియా అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షిస్తూ రైతులకు సరఫరా చేయించాలని సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వరద విపత్తుల నిర్వహణ కోసం కలెక్టరేట్, కేఎంసీల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశామని, మున్నేటి పరీవాహక ప్రాంతంలో ఆపదమిత్రులుగా యువతకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల వాతావరణ పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని చెప్పారు. ఇక యూరియా లభ్యత, సరఫరాను పర్యవేక్షిస్తుండగా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, సీపీఓ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి.పుల్లయ్య, డీఎంహెచ్‌ఓ కళావతి బాయి, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.