
ప్రణాళికాయుతంగా నగర అభివృద్ధి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగర అభివృద్ధి ప్రణాళికా యుతంగా జరిగేలా కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 3వ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విలీన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటివరకు రూ.200 కోట్ల నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. మరో రూ.150 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉందని చెప్పారు. అంతేకాక ఆగస్టు 15నాటికి కనీసం రూ.100 కోట్ల నిధులు ఖమ్మం కార్పొరేషన్‌కు మంజూరు కానున్నాయని తెలిపారు. ఇప్పటికే రూ.280 కోట్లతో తీగల వంతెన, రూ.160 కోట్లతో మోడల్ మార్కెట్, రూ.30 కోట్లతో ఖిల్లా రోప్‌వే, రూ.200 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మేయర్ పునుకొల్లు నీరజ, కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, ఆర్‌డీఓ నర్సింహారావు, కేఎంసీ సహాయక కమిషనర్ అనిల్, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, మునిసిపల్ ఈఈ కృష్ణలాల్, ఏసీపీ వసుంధర, విద్యుత్‌శాఖ డీఈ రామారావు, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్ లకావత్ సైదులుతో పాటు కాంగ్రెస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నల్లమల వెంకటేశ్వర్లు, మలీదు మనీష్, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు