
సైనికుల త్యాగాలు చిరస్మరణీయం
ఖమ్మంమయూరిసెంటర్: సైనికుల త్యాగాలను చిరస్మరణీయమని.. వారి సేవలను ఎల్లవేళలా గుర్తు చేసుకోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం ఫ్రీడమ్ పార్క్‌లో శనివారం జరిగిన చేపట్టిన కార్గిల్ విజయ దివస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ప్రజలంతా ప్రశాంతంగా, అభివృద్ధి పథంలో సాగడానికి సరిహద్దులో కష్టపడుతున్న సైనికులే కారణమని తెలిపారు. దేశ సరిహద్దులో 25 ఏళ్ల క్రితం సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడడం ద్వారా కార్గిల్ విజయాన్ని అందించారని చెప్పారు. అనంతరం అమరవీరుల కుటుంబసభ్యులను సన్మానించడమే కాక ఫ్రీడమ్ పార్క్‌లో కలెక్టర్ మొక్కలు నాటారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి ఎం.చంద్రశేఖర్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీసీపీ రామోజీ రమేష్, వింగ్ కమాండర్ సురేంద్ర, మాజీ సైనికుల అసోసియేషన్ బాధ్యులు, అధికారులు పాల్గొన్నారు.
రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
సత్తుపల్లి: నూతన రేషన్‌కార్డుల జారీ, మార్పులు, చేర్పులు నిరంతరం సాగుతాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సత్తుపల్లి మండలం కొత్తూరు రైతువేదికలో శనివారం రేషన్‌కార్డు మంజూరు పత్రాలను ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి అందజేశారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో 2,200 మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. తద్వారా వారికి సన్నబియ్యం అందడమే కాక ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో సత్తుపల్లి ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. ఈ సమావేశంలో కల్లూరు ఆర్డీఓ రాజేంద్రగౌడ్, సింగరేణి పీఓ నర్సింహారావు, డీఎస్‌ఓ కె.చంద్రకుమార్, నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, చల్లగుండ్ల కృష్ణయ్య, చల్లగుళ్ల నర్సింహారావు, గాదె చెన్నారావు, నారాయణవరపు శ్రీనివాసరావు, తోట సుజలరాణి, కొప్పుల నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్గిల్ దివస్ వేడుకల్లో కలెక్టర్ అనుదీప్

సైనికుల త్యాగాలు చిరస్మరణీయం