
‘సర్వేలతో బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్’
ఖమ్మం మామిళ్లగూడెం: సర్వేల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్.ప్రభాకర్ పేర్కొన్నారు. ఖమ్మంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నది ఆ పార్టీ కుట్రగా భావిస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీల జనాభా 55శాతమని తేలగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వేలో బీసీల జనాభా తక్కువగా ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాక 42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోనున్నందున బీజేపీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నాయకులు గల్లా సత్యనారాయణ, సన్నె ఉదయప్రతాప్, తాండ్ర వినోద్‌రావు, నున్న రవికుమార్, నంబూరి రామ లింగేశ్వర్‌రావు, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.