
యూరియా కోసం రైతుల ఆందోళన
తల్లాడ: తల్లాడ సొసైటీకీ శుక్రవారం లారీ లోడ్ యూరియా రావడంతో రైతులంతా ఒకేసారి దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. సొసైటీకి 445 బస్తాల యూరియా వచ్చిందనే సమాచారంతో పరిసర గ్రామాల రైతులు చేరుకున్నారు. అయితే, ఇందులో నుంచి మిట్టపల్లికి 220 బస్తాలు పంపాల్సి ఉందని సొసైటీ చెప్పగా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లాడ సొసైటీ పరిధిలో 12గ్రామాలు ఉండగా, 225 బస్తాలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అందరికీ యూరియా సరఫరా చేయాల్సిందేనని బీజేపీ నాయుకుడు ఆపతి వెంకటరామారావు ఆధ్వర్యాన రైతులు నిరసన తెలిపారు. ఈమేరకు ఏడీఏ శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో చర్చించగా తల్లాడ సొసైటీ పరిధి రైతులకు పంపిణీ చేసేలా అంగీకరించారు. అప్పటికే తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎస్‌ఐ వెంకటకృష్ణ, ఏఓ తాజుద్దీన్, సీఈఓ నాగబాబు రైతులకు నచ్చచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.