
ఎందుకనో వెనుకబడ్డాయి..
● స్వచ్ఛ సర్వేక్షన్‌లో పడిపోయిన పురపాలికల ర్యాంకులు ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో విసిరేసినట్లుగా ఉమ్మడి జిల్లా ● మున్సిపాలిటీలదే కాదు.. కార్పొరేషన్‌దీ అదేతీరు
ఖమ్మంమయూరిసెంటర్: స్వచ్ఛ సర్వేక్షన్ – 2024 ర్యాంకుల్లో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. గతంలో మెరుగైన స్థానాల్లో నిలిచిన ఖమ్మం కార్పొరేషన్, ఇల్లెందు మున్సిపాలిటీ ర్యాంకులు ఈసారి దిగజారాయి. మిగతావి ముందంజలో నిలవకపోయినా గతంతో పోలిస్తే ర్యాంకులు స్వల్పంగా మెరుగుపడడం కొంత ఊరట కలిగిస్తోంది. కానీ జాతీయస్థాయి పక్కన పెడితే రాష్ట్రస్థాయి ర్యాంకుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఏ మున్సిపాలిటీకి గౌరవనీయమైన స్థానం దక్కకపోవడం ప్రజలతో పాటు అధికారులను సైతం నిరాశపరిచింది. ఏదిఏమైనా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, వ్యర్థాల శుద్ధి, తాగునీటి సరఫరా, చెరువుల నిర్వహణ, టాయిలెట్ల శుభ్రత వంటి అంశాలపై శ్రద్ధ కొరవడిందని స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకులు స్పష్టం చేస్తున్నాయి.
పడిపోయిన ర్యాంకులు..
గత కొన్నేళ్లుగా స్వచ్ఛత విషయంలో ఖమ్మం కార్పొరేషన్, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలు కొంత మెరుగైన ఫలితాలే సాధించాయి. కానీ, ఈసారి ర్యాంకులు దిగజారడం గమనార్హం. స్వచ్ఛ సర్వేక్షన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏటా పారిశుద్ధ్యం, పరిశుభ్రత, తాగునీటి నిర్వహణపై వార్షిక సర్వే చేయించి ఫలితాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తోంది. ఈసారి తక్కువగా నమోదైన ర్యాంకులు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించేలా ఉన్నాయి. నిధులు కేటాయించడంతో సరిపెడుతూ వాటిని సమర్థవంతంగా వినియోగించడంలో మాత్రం పాలకవర్గాలు విఫలమయ్యాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా వర్షాకాలం నగరాలు, పట్టణాల్లో నీటి నిల్వ, దోమల బెడద, చెత్త కుప్పలు వంటి సమస్యలు పెరుగుతున్న తరుణంలో స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంకుల పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాలను పాలకవర్గాలే కాక అధికారులు పరిగణనలోకి తీసుకుని పట్టణాల పరిశుభ్రతకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రచారాలతోనే సరి..
ఖమ్మం నగర పాలక సంస్థతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రచారం ఊదరగొడుతున్న అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఇంటింటా చెత్త సేకరణ చేస్తున్నా.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఎక్కడ కూడా సేకరించిన దాఖలాలు లేవు. ఇక ఈసారి వంద శాతం చెత్త సేకరించిన మున్సిపాలిటీగా ఒక్కటీ లేదు. ఉమ్మడి జిల్లాలో తడి, పొడి చెత్త సేకరణలో 39 శాతం మార్కులు సాధించి ఉమ్మడి జిల్లాలో కొత్తగూడెం మున్సిపాలిటీ అగ్రస్థానంలో నిలవగా... పబ్లిక్ టాయిలెట్ల శుభ్రతలో కొత్తగూడెం మినహా అన్ని మున్సిపాలిటీలు వెనుకబడినట్లు స్వచ్ఛ సర్వేక్షన్ మార్కుల ద్వారా వెల్లడైంది.
గతంతో పోలిస్తే కిందకు..
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఇల్లెందు మున్సిపాలిటీల ర్యాంకులు పడిపోవడం గమనార్హం. 2023లో ఖమ్మం మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు రాగా.. ఈ నెల 17న ప్రకటించిన 2024 ఏడాడి ర్యాంకుల్లో 60కి పడిపోయింది. జాతీయస్థాయిలో 141 నుంచి 373కు దిగజారింది. ఇల్లెందు మున్సిపాలిటీ రాష్ట్రంలో 21వ ర్యాంకు నుంచి 93వ ర్యాంకుకు పడిపోగా, జాతీయస్థాయిలో 539 నుంచి 927వ ర్యాంకుకు దిగజారింది. ఇక మధిర, సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు మున్సిపాలిటీలు మాత్రం అద్భుతమైన ప్రగతి సాధించకపోయినా రాష్ట్ర, జాతీయస్థాయిలో కొంత మెరుగైన ర్యాంకులు సాధించాయి.
స్వచ్ఛ సర్వేక్షన్ – 2024లో ర్యాంకులు
కార్పొరేషన్ / రాష్ట్ర జాతీయ
మున్సిపాలిటీ ర్యాంకు ర్యాంకు
ఖమ్మం 60 373
పాల్వంచ 49 302
కొత్తగూడెం 65 396
ఇల్లెందు 93 927
సత్తుపల్లి 95 941
మణుగూరు 103 1,032
మధిర 113 1,108
వైరా 129 1,290