ఆర్‌డీఓ ఆఫీస్‌లో కంప్యూటర్లు జప్తు | - | Sakshi
Sakshi News home page

ఆర్‌డీఓ ఆఫీస్‌లో కంప్యూటర్లు జప్తు

Jul 26 2025 8:50 AM | Updated on Jul 26 2025 9:28 AM

ఆర్‌డీఓ ఆఫీస్‌లో  కంప్యూటర్లు జప్తు

ఆర్‌డీఓ ఆఫీస్‌లో కంప్యూటర్లు జప్తు

ఖమ్మం లీగల్‌: ఖమ్మంలో బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి భూమి ఇచ్చిన మహిళకు పరిహారం చెల్లింపు విషయమై కోర్టు ఆదేశాలతో ఆర్‌డీఓ కార్యాలయ కంప్యూటర్లను శుక్రవారం జప్తు చేశారు. 1986లో భూమి సేకరించగా గజానికి రూ.400 చొప్పున 2007లో పరిహారం చెల్లించారు. అయితే, ఈ పరిహారం తక్కువగా ఉందంటూ సూరపనేని స్వర్ణ తన భూమి 1,740 గజాలకు పరిహారం పెంచాలని జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు గజానికి రూ.2,500 చొప్పున చెల్లించాలని 2021లో తీర్పు ఇవ్వగా, ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్‌ చేసింది. అక్కడ పరిహారం మరింత పెంచుతూ నిర్వాసితురాలికి గజానికి రూ.6వేల చొప్పున చెల్లించాలని ఆదేశించారు. ఇందులో 50 శాతం జమ చేయాలని ఆదేశించి మూడేళ్లు దాటినా స్పందన లేకపోవడంతో ఆర్‌డీఓ కార్యాలయ సామగ్రిని జప్తు చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు కోర్టు సిబ్బంది వెళ్లి ఆర్‌డీఓ కార్యాలయంలోని కంప్యూటర్లను జప్తు చేశారు.

అంగన్‌వాడీల బలోపేతానికి చేపడుతున్న చర్యలు ఏమిటి?

ఖమ్మంమయూరిసెంటర్‌: అంగన్‌వాడీ సెంటర్ల బలోపేతానికి కేంద్రప్రభుత్వం ఏమేం చర్యలు చేపడుతుందో తెలపాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కోరారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా శుక్రవారం ఈ అంశంపై ఆయన మాట్లాడారు. దీనికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహా య మంత్రి సావిత్రిఠాకూర్‌ సమాధానమిచ్చా రు. 2024 నుంచి ఈ ఏడాది జూన్‌ నాటికి కనీసం 80శాతం పనిదినాలు నిర్వర్తించిన సెంటర్లు తెలంగాలో 32,551 ఉండగా, 20 శాతం లోపు తెరిచిన సెంటర్లు 386 ఉన్నాయని తెలిపారు. అలాగే, అప్‌గ్రేడ్‌కు తెలంగాణలో 5,008 సెంటర్లు ఎంపిక చేయగా రూ.2.7 కోట్లు మంజూరు చేశామని వివరించారు.

నేటి అథ్లెటిక్స్‌

ఎంపికలు వాయిదా

ఖమ్మం స్పోర్ట్స్‌: జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన శనివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో జరగాల్సిన అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను వాయిదా వేసినట్లు జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్‌ అహ్మద్‌ తెలిపారు. జిల్లావ్యాప్తంగా వర్షాల నేపథ్యాన ఈ నిర్ణయం తీసుకోగా, ఎంపిక పోటీలు 30వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలని సూచించారు.

ఇద్దరు బాలకార్మికుల గుర్తింపు

తిరుమలాయపాలెం: మండలంలోని పిండిప్రోలులో ఓ దాబా, తిరుమలాయపాలెంలోని వెల్డింగ్‌ షాపులో బాలకార్మికులతో పనిచేస్తున్నారని ముస్కాన్‌ బృందం గుర్తించింది. బృందం సభ్యులు, పోలీసులతో కలిసి శుక్రవారం తనిఖీ చేపట్టగా 15ఏళ్ల బాలలతో పనిచేస్తున్నట్లు తేలింది. ఈమేరకు యజమానులు పోట్ల నాగేశ్వరరావు, మాలోతు భద్రుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కల్లూరు డివిజన్‌కు

సాగర్‌ జలాలు

కల్లూరురూరల్‌: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి పాలేరు జలాశయానికి నీరు చేరగా, ఇటీవల ఎడ మ కాల్వ ద్వారా సాగు అవసరాలకు విడుదల చేశారు. రిజర్వాయర్‌ నుంచి 1,085 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తుండడంతో ఇన్నాళ్లు కల్లూరు డివిజన్‌కు సీతారామసాగర్‌ ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలను శుక్రవారం నిలిపివేశారు. పాలేరు నుంచి శుక్రవారం సాయంత్రం 600 క్యూసెక్కుల నీరు ఏన్కూరు కెనాల్‌ 52వ కి.మీ. వద్దకు చేరింది. ప్రస్తుతం కల్లూరు డివిజన్‌లోని కాల్వల్లో అటు కృష్ణా జలాలు 1,085 క్యూసెక్కులు, గోదావరి జలాలు 600 క్యూసెక్కుల మేర ప్రవహిస్తూ శుక్రవారం సాయంత్రం 55 కి.మీ. వరకు 1,200 క్యూసెక్కుల నీరు చేరింది. అలాగే, కప్పలబంధం హెడ్‌ రెగ్యులేటరీ 77వ కిలోమీటర్‌ వద్దకు 950 క్యూసెక్కుల నీరు చేరగా మధిర బ్రాంచ్‌ కెనాల్‌కు.. ఆపై పుణ్యపురం మేజర్‌, మైనర్‌ కాల్వలకు, మెయిన్‌ కెనాల్‌ ద్వారా పెనుబల్లి, వేంసూరుకు విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement