
‘రామదాసు’తో సాగు కళకళ
● పాలేరు నియోజకవర్గంలో 71వేల ఎకరాలకు నీరు ● 213 చెరువులు 50శాతం మేర నింపేలా ప్రణాళిక ● ఉత్సాహంగా వరినాట్లకు సిద్ధమవుతున్న రైతాంగం ● వైఎస్సార్ హయాంలో నిర్మించిన కాల్వల్లో పారుతున్న జలాలు
తిరుమలాయపాలెం: కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం పాలేరు నియోజకవర్గం ఇప్పుడు భక్తరామదాసు ఎత్తిపోతల పథకంతో సస్యశ్యామలంగా మారుతోంది. ప్రాజెక్టు నీటితో చెరువులు, కుంటలు నిండగా.. బోర్లు, బావుల్లో భూగర్బ జలాలు పెరిగి వరుణుడి కరుణ లేకున్నా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తిరుమలాయపాలెం, కూసుమంచి మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు సాగునీటి కొరత లేకపోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కోసం తవ్విన కాల్వలు ఇప్పుడు భక్త రామదాసు ప్రాజెక్టు విజయవంతానికి తోడ్పాటునివ్వడం విశేషం. తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండా వద్ద ఈ ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే పాలేరు జలాలు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నాలుగు మండలాలకు చేరుతున్నాయి.
అరకొర వర్షాలైనా సరే..
ఈ ఏడాది ఇప్పటివరకు సరిపడా వర్షాలు లేక, బావులు, బోర్లలోనూ భూగర్భ జలాల కొరతతో వరి, మిర్చి సాగుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఇంతలోనే పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనలతో భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల చేయగా... రైతులు వరి నాట్లకు సిద్ధమవుతున్నారు. అలాగే, మిగిలిన ఆరుతడి పంటలకు సైతం ఇబ్బంది ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల్లో 213 చెరువులు నింపడం ద్వారా 71,927 ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాక మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో 2,440 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
అన్ని చెరువులకు నీరు అందేలా...
భక్తరామదాసు ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత మేర అన్ని చెరువులు నింపేందుకు మంత్రి పొంగులేటి ఆదేశాలతో జల వనరుల శాఖ అధికారులు గత ఏడాదే అవసరమైన చోట కాల్వలు, యూటీల నిర్మాణంతో పాటు గేట్‌వాల్స్ ఏర్పాటుచేశారు. వర్షాభావ పరిస్థితులతో ఈసారి విడుదల చేసిన నీరు చెరువులకు చేరింది. దీంతో రైతులు బీడు భూములను సైతం సాగులోకి తెచ్చి వరి, ఇతర వాణిజ్య పంటలు సాగుచేస్తున్నారు. గతంలో ఒకే పంటకు పరిమితమైన వారు రెండు పంటలు పండిస్తామని చెబుతున్నారు. కాగా, రబీలోనూ వరి, మొక్కజొన్న, పెసర, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నందున దఫాల వారీగా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి
గతంలో చెరువుల్లో నీరు లేక మత్స్యకార్మికులు చేపల పెంపకానికి ఇబ్బంది పడేవారు. కానీ ఈసారి వర్షాలు లేకున్నా భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి 213చెరువులకు నీరు చేరింది. ఫలితంగా చేపల పెంపకానికి ఇక్కట్లు ఉండవని సంతోషం వ్యక్తం చేస్తున్న వారు చేపపిల్లలు కూడా పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
మండలాల వారీగా నీరు అందనున్న భూమి
మండలం భూమి (ఎకరాల్లో)
తిరుమలాయపాలెం 30,143
కూసుమంచి 25,179
ఖమ్మం రూరల్ 12,605
నేలకొండపల్లి 4,000
ముదిగొండ 2,440

‘రామదాసు’తో సాగు కళకళ

‘రామదాసు’తో సాగు కళకళ