
టీచర్లు.. అటూఇటు
● ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రణాళిక ● ఈనెల 28వ తేదీలోగా పూర్తికి సన్నాహాలు ● విద్యార్థుల సంఖ్య ఆధారంగా అడ్టస్ట్‌మెంట్
ఖమ్మం సహకారనగర్: ఈ విద్యాసంవత్సరం అవసరమైన ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కేటాయింపునకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా అదనంగా ఉన్నచోట్ల నుంచి అవసరమైన పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు(వర్క్ అడ్జస్ట్‌మెంట్) చేయనున్నారు. అయితే, గత ఏడాది మూడుసార్లు టీచర్ల సర్దుబాటు చేసినా చివరి సమయంలో పలు సబ్జెక్టులు బోధించేందుకు ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఈసారి అలా జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
858 పోస్టులు ఖాళీ
జిల్లాలో 1,216 పాఠశాలలు ఉండగా సుమారు 68వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాకు కేటాయించిన 5,815 ఉపాధ్యాయ పోస్టుల్లో 4,957మందే విధులు నిర్వర్తిస్తుండగా 858 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాక ఈనెలలో 10 – 20మంది వరకు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనేపథ్యాన ఈనెల 15వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని 28వ తేదీకల్లా ఉపాధ్యాయుల సర్దుబాటు(వర్క్ అడ్జస్ట్‌మెంట్) పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా, జిల్లాలో గ్రేడ్–2 హెచ్‌ఎం పోస్టులు 33 ఖాళీలు ఉన్నాయి. అలాగే, స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) మ్యాథ్స్ 22, ఫిజిక్స్ 20, బయాలజీ 54, ఇంగ్లిష్ 29, సోషల్ 72, తెలుగు 37, హిందీ 29తో పాటు ఇంకొన్ని పోస్టులు ఖాళీగా ఉండడం బోధనకు ఆటకంగా మారుతున్న నేపథ్యాన వర్క్ అడ్టస్ట్‌మెంట్ కీలకంగా నిలవనుంది.
గతేడాది ఇలా...
గతేడాది వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులు 165మందిని సర్దుబాటు చేశారు. ఇందులో 40మంది ఎస్‌జీటీలూ ఉన్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, బయాలజీ సైన్స్, సోషల్ టీచర్లకు అవసరమైన చోటకు కేటాయించారు. అయితే, సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు సమీప ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే, గత ఏడాది ఉద్యోగ విరమణ తేదీని పరిగణనలోకి తీసుకోకపోవడంతో వారు రిటైర్‌కాగానే మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో మూడుసార్లు సర్దుబాటు చేయడం విమర్శలకు తావిచ్చింది.
ఆ అనుభవాలు పరిగణనలోకి తీసుకుంటేనే...
గత విద్యాసంవత్సరం మూడు సార్లు టీచర్ల సర్దుబాటు చేసినా చివరి సమయంలో సబ్జెక్ట్ టీచర్ల కొరతతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. దీంతో ఈసారైనా మార్చి వరకు ఉద్యోగ విరమణ చేసే వారిని కాకుండా మిగతా వారిని పరిగణనలోకి తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈసారి 200మంది వరకు కీలక సబ్జెక్టు టీచర్ల సర్దుబాటుకు అవకాశం ఉండగా... సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న 350మంది ఖమ్మం, సమీప ప్రాంతాలకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యాన జిల్లాలో టీచర్ల అడ్టస్ట్‌మెంట్ అంశంపై సమీక్షించేందుకు అదనపు కలెక్టర్ శ్రీజ విద్యాశాఖ అధికారులతో చర్చించనున్నట్లు తెలిసింది.
సాఫీగా జరిగేలా..
జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియపై దృష్టి సారించాం. ఇప్పటికే ఎంఈఓల ద్వారా వివరాల సేకరణ మొదలైంది. ఎక్కడెక్కడ టీచర్ల కొరత ఉందో పరిగణనలోకి తీసుకున్నాక అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశాలతో అడ్టస్ట్‌మెంట్ చేయనున్నాం.
– ఎస్.సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి

టీచర్లు.. అటూఇటు