
వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యత
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ విద్యుత్ సర్వీసుల జారీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఖమ్మం ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సర్వీసుల మంజూరీ 14 శాతం పెరిగిందని వెల్లడించారు. 2023 జూలై 15నుంచి 2025 జూలై 14 వరకు 3,875 వ్యవసాయ సర్వీసులు మంజూరీ చేయగా, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 14 వరకు 4,018 సర్వీసులు మంజూరు చేశామని తెలిపారు. అలాగే, పొలంబాటలో భాగంగా వంగిన స్తంభాలు, లూజ్ లైన్లను గుర్తించి సరిచేస్తున్నామని, ఇందులో భాగంగా1,937 లైన్లను సరిచేయడమేకాక అవసరమైన చోట 2,013 స్తంభాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్ల అవసరాలకు రైతులకు వివరిస్తున్నామని, అధిక లోడ్ ఉన్న చోట 360 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మరమ్మతుకు గురైన ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేశామని, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పట్టణాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోగా కొత్తవి అమరుస్తున్నామని ఎస్‌ఈ వెల్లడించారు.
కొత్తలింగాలలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం
కామేపల్లి/కారేపల్లి: కామేపల్లి మండలం కొత్తలింగాల సబ్ స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కేంద్రాన్ని ఎస్‌ఈ శ్రీనివాసాచారి భూమి పూజ చేశారు. ఈ కేంద్రం ద్వారా కామేపల్లి, కారేపల్లి, రఘునాథపాలెం, ఏన్కూరు మండలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే సత్వర మరమ్మతుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆతర్వాత కారేపల్లి మండలం చీమలపాడు సబ్‌స్టేషన్‌లో లోఓల్టేజీ నివారణకు అమర్చిన 5ఎంవీఏ పవన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్‌ఈ శ్రీనివాసాచారి చార్జ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఈలు భద్రుపవార్, రామారావు, ఉద్యోగులు రాందాస్, ఆనంద్‌కుమార్, రామకృష్ణ, రాజేష్, వెంకటేశ్వర్లు, వై.వీ.ఆనంద్‌కుమార్, ఇందిర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి