వెదురు బొంగులకు చెదలు.. | - | Sakshi
Sakshi News home page

వెదురు బొంగులకు చెదలు..

Jul 15 2025 6:51 AM | Updated on Jul 15 2025 6:53 AM

● భారీగా సరుకు రాక.. వేలంలో జాప్యంతో సమస్య ● సత్తుపల్లి డిపోలో పరిశీలించిన ఎఫ్‌డీసీ ఎండీ సునీత ఎం.భగవత్‌

సత్తుపల్లి: నాణ్యత లేకపోవడమేకాక ఒకేసారి భారీగా సరుకు వచ్చినా వేలంలో జాప్యంతో వెదురు బొంగులు చెదలు పడుతున్నాయి. అంతేకాక తాజా వర్షాలతో తడిసి ఎక్కడికక్కడ విరిగిపోతుండడంతో ప్రస్తుతం వేలం వేసినా సరైన ఆదా యం వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. వెదురుబొంగుల్లో నాణ్యత లేమికి తోడు అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.

4లక్షలకు పైగా బొంగులకు...

సత్తుపల్లిలో అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌(ఎఫ్‌డీసీ) ద్వారా ఏళ్ల క్రితం వెదురు డిపో ఏర్పాటుచేశారు. ఈ డిపోకు సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ అటవీ డివిజన్ల నుంచి వెదురుబొంగు వస్తోంది. ఏటా 12 – 15లక్షల టన్నుల వెదురు డిపోకు వస్తుందని అంచనా. కానీ ఈ ఏడాది వెదురుబొంగుల చెట్లకు ఫ్లవరింగ్‌(పూత) సమస్య రావడంతో ఒకేసారి చెట్లన్నీ తొలగించారు. దీంతో ఏకంగా డిపోకు 33లక్షల వెదురుబొంగులు చేరాయి. సత్తుపల్లి మండలం బుగ్గపాడు, దమ్మపేట మండలం గండుగులపల్లి రేంజ్‌ల్లో 40 ఏళ్ల క్రితం అటవీ అధికారులు వెదురు ప్లాంటేషన్‌ వేశారు. అప్పటి నుంచి దిగుబడి బాగానే వచ్చింది. ఈ ఏడాది చెట్ల జీవితకాలం ముగియనుండడంతో ఫ్లవరింగ్‌ వచ్చినట్లు తెలు స్తుండగా విక్రయాల్లో జాప్యంతో చెదలు పడుతున్నట్లు తెలిసింది. ఇందులో 4లక్షలకు పైగా బొంగులకు చెదలు పట్టడంతో ఎక్కడికక్కడ విరిగిపోతున్నాయని సమాచారం.

వేలంలో అధికారుల నిర్లక్ష్యం

వెదురు పెద్ద ఎత్తున రావటంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రతీ నెల రెండుసార్లు వేలంపాట ద్వారా వెదురు అమ్ముతుంటారు. కానీ ఎక్కువ మొత్తంలో పేరుకుపోతే కనీసం ఐదారు సార్లు వేలం వేసే అవకాశం ఉన్నా ఆ దిశగా స్పందించలేదు. ఫలితంగా వెదురు పేరుకుపోయి చెదలు పట్టి ఇప్పుడు అమ్మలేని పరిస్థితి ఎదురైంది. కాగా, వెదురుబొంగుతో చేసిన గుజ్జుతో చెక్‌ పేపర్లు, బాండ్‌ పేపర్లు తయారుచేస్తారు. ఇటీవల వెదురుబొంగుల స్థానంలో సుబాబుల్‌, జామాయిల్‌ వినియోగిస్తుండడంతో డిమాండ్‌ తగ్గుతోంది. గతంలో భద్రాచలం, కాగజ్‌నగర్‌, రాజమండ్రి పేపర్‌ బోర్డుల నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గాయని సమాచారం.

ఉత్పత్తి పెరగడంతోనే...

ఈ ఏడాది వెదురుబొంగుల ఉత్పత్తి పెరగగా, ఆర్డర్లు సరిపడా లేక బొంగులు పేరుకుపోయి చెదలు పడుతోందని టీజీ ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీత ఎం.భగవత్‌ తెలిపారు. సత్తుపల్లి అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ డిపోను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ నష్టనివారణ చర్యల్లో భాగంగా వెదురు బొంగును కటింగ్‌ చేసి పరిశ్రమలకు విక్రయిస్తామని తెలిపారు. అయితే, వెదురుకు చెదలు పట్టడం వల్ల నష్టం ఎదురవుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. కాగా, ఈ ఏడాది ఎకో టూరిజం, జామాయిల్‌, జీడి మామిడి సాగుతో సంస్థకు రూ.310 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. జిల్లాలోని కనిగిరిగుట్టల్లో ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌డీసీ ఉద్యోగులు స్కైలాబ్‌, ఎం.గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

వెదురు బొంగులకు చెదలు..1
1/1

వెదురు బొంగులకు చెదలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement