
పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు
ఏన్కూరు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థులు నమోదు పెరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.సత్యనారాయణ తెలిపా రు. ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లి పాఠశాలను సోమవారం తనిఖీ చేసిన ఆయన విద్యార్థుల నమోదు, హాజరు, బోధనపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో వసతులు కల్పించడంతో పాటు బడిబాట ద్వా రా విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. కలెక్టర్ చొరవతో కొత్తమేడేపల్లి పాఠశాలో ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై నియమించనున్నామని తెలిపారు. కాగా, జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఒక జత యూనిఫామ్ పంపిణీ చేశామని డీఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏంఈఓ రహీంబీ, ఉపాధ్యాయుడు జయరాం పాల్గొన్నారు.
ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్–1, 2, 3, 4తో పాటు ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ల పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.శ్రీలత తెలిపారు. ఈ శిక్షణ వచ్చే నెల 25నుంచి 150 రోజులు ఉంటుందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 08742–230848, 95738 59598, 94419 31359 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేడు ఆన్‌లైన్‌లో శిక్షణ
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మంగళవారం ఆన్‌లైన్ విధానంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో జెడ్పీ అధికారులు, డీపీఓ, ఎంపీడీఓలు పాల్గొనాలని ఆదేశాలు అంధాయి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఉదయం 11–30నుంచి 12–30గంటలకు వరకు శిక్షణ జరగనుండగా, ఆతర్వాత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు.
‘సీతారామ’తో 60 వేల ఎకరాలకు సాగునీరు
ఏన్కూరు: సీతారామ ప్రాజెక్టు ద్వారా వైరా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 60 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందనున్నాయని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తెలిపారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నుంచి విడుదల చేసిన నీరు జూలూరుపాడు మండలం వినోభానగర్ నగర్ వద్దకు చేరాయి. ఈ మేరకు ఏన్కూరులోని సాగర్ లింక్ కెనాల్‌కు నీటిని సోమవారం విడుదల చేసిన ఎమ్మెల్యే రాందాస్ మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల్లో సాగుకు ఇబ్బంది లేకుండా గోదావరి జలాలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు శెట్టిపల్లి వెంకటేశ్వరావు, వేముల కృష్ణప్రసాద్, స్వర్ణ నరేందర్, రాయల నాగేశ్వరావు, బొర్రా రాజశేఖర్, మేడ ధర్మారావు పాల్గొన్నారు.

పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల నమోదు