
సింధుకు అండగా ఎంపీ, మంత్రి
కూసుమంచి: కూసుమంచి మండలంలోని ధర్మాతండాకు చెందిన జర్పుల సింధు రోడ్డు ప్రమాదంలో గాయపడి అచేతన స్థితికి చేరగా, వైద్యం చేయించలేని పరిస్థితుల్లో ఆమె తండ్రి పరశురాం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన గతనెల 29న ఆత్మహత్య చేసుకోగా ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘నా వల్ల కావడం లేదు తల్లీ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటాగా స్వీకరించిన విషయం విదితమే. అలాగే, ఈనెల 3వ తేదీన సింధు కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పరామర్శించి సింధు చికిత్స బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఆమెను ఎంపీ రఘురాంరెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అలాగే, సింధు చికిత్సపై వైద్యులతో మాట్లాడడమే కాక మందులు ఇప్పించి ఆర్థిక సాయం అందజేశారు.