
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త పరికరాలు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలకు కొత్త పరికరాలు చేరుకున్నాయి. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లో స్లాట్ విధానం అమలు చేస్తుండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగంగా ముగించేలా కొత్త కంప్యూటర్‌లు, స్కానర్‌లు, బయోమెట్రిక్ డివైజ్‌లను అందజేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఈ పరికరాలు వచ్చాయి. పాత వాటితో రిజిస్ట్రేషన్లు ఆలస్యమవుతుండగా కొత్త పరికరాలు సరఫరా చేశారని, వాటిని ఆయా కార్యాలయాల్లో అమర్చామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ
● రజత పతకం సాధించిన మల్లెమడుగు విద్యార్థినులు
ఖమ్మంఅర్బన్ : మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురంలో ఈనెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో మల్లెమడుగు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చాట్లారు. కె.అనిత, టి. నవ్యశ్రీ రజత పతకం సాధించారు. గతేడాది వనపర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అనిత కాంస్య పతకం సాధించిందని, హైదరాబాద్‌లో జరిగిన సీఎం కప్ పోటీల్లో స్వర్ణ పతకం గెలుచుకుందని ప్రధానోపాధ్యాయురాలు జి.కృష్ణవేణి, పీడీ బియ్యని కృష్ణయ్య వివరించారు. కాగా, ఈ విద్యార్థినులను ఎంఈఓ శైలజలక్ష్మి తదితరులు అభినందించారు.
ప్రొఫెసర్‌కు సేవా జ్యోతి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఎర్రుపాలెం: కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలనా శాస్త్రం, హెచ్‌ఆర్‌ఎం ప్రొఫెసర్, మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన డాక్టర్ పెద్దమళ్ల శ్రీనివాసరావు ఏపీలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సేవా జ్యోతి లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డును ఆదివారం అందుకున్నారు. దివ్యాంగుడైన శ్రీనివాసరావు అంగవైకల్యం గల వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్నారు. ఆయనకు అవార్డు రావడం పట్ల పలువురు అభినందించారు.
ముందుగానే
సాగర్ జలాలు..
ఖమ్మంఅర్బన్ : జిల్లాలోని ఎన్నెస్పీ ఆయకట్టు రెండోజోన్‌కు ఈ ఏడాది ఖరీఫ్ పంటలకు గాను సాగర్ జలాలు దాదాపు నెల రోజులు ముందుగానే విడుదల కానున్నాయి. గతేడాది రెండో జోన్‌కు ఆగస్టు 3న నీరు విడుదల చేశారు. అయితే ఈ సంవత్సరం రైతుల అవసరాలు, డ్యామ్‌లో నీటి నిల్వలు, వరదల ప్రవాహం దృష్ట్యా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారమే నీరు విడుదల చేయనున్నారు. సాగర్ ప్రాజెక్టు ప్రారంభంలోనే వేసిన డిజైన్ ప్రకారం.. జోన్–1కు జూలై 10, జోన్ –2కు ఆగస్టు 10, జోన్ –3కు నవంబర్ 15 తేదీల్లో నీరు విడుదల చేయాల్సి ఉండగా రైతుల అవసరాల మేరకు ముందుగానే అందిస్తున్నారు.
‘కోటా’కు జిల్లాతో
ప్రత్యేక అనుబంధం
ఖమ్మంగాంధీచౌక్ : సినీ నటుడు కోటా శ్రీనివాసరావుకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మానికి చెందిన డాక్టర్ నాగబత్తిని రవి 1988లో నిర్మాతగా పనిచేసిన ఊరేగింపు సినిమాలో కోటా మంత్రిగా నటించారు. ఆయన నటించిన మరికొన్ని సినిమా షూటింగ్‌లు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. ఖమ్మంతో పాటు భద్రాచలం, పాల్వంచ ప్రాంతాలతో కూడా ఆయనకు అనుబంధం ఉన్నట్లు కళాకారులు చెబుతున్నారు. 83 ఏళ్ల శ్రీనివాసరావు ఆదివారం మరణించగా జిల్లా వాసులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి, కార్యదర్శి వేల్పుల విజేత, ఆర్క్ కళా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మోటమర్రి జగన్మోహన్ రావు, అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్ తదితరులు సంతాపం తెలిపారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కొత్త పరికరాలు