
ఉత్పత్తి.. ఉత్తుత్తే...
వైరా: జిల్లాలోని వైరాలో 48ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం(మత్స్య విత్తన కేంద్రం) నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. కేంద్రంపై పాలకులు, అధికారులు సవతితల్లి ప్రేమ కనబరుస్తుండడంతో ఉత్పత్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి. సరైన సౌకర్యాలు లేక, సరిపడా సిబ్బందిని నియమించక ఈ పరిస్థితి ఎదురవుతోంది. కార్యాలయం, హెచరీ గది శిథిలావస్థకు చేరడంతో కేంద్రం కళ తప్పింది. అంతేకాక ఇక్కడ ఐదుగురు ఫిషర్‌మెన్స్ పోస్టులకు గాను ఇద్దరే విధులు నిర్వర్తిస్తున్నారు.
ముంచుకొచ్చిన సీజన్
చేపపిల్లల సంతానోత్పత్తికి జూలై, ఆగస్టు మాసాలే అనువైనవి. ఇక్కడ ఉత్పత్తి చేసిన చేప పిల్లలను స్పాన్‌గా మారుస్తారు. తొలుత చెరువుల నుంచి తల్లి చేపలను తీసుకుకొచ్చి గుడ్లు సేకరిస్తారు. ఆపై హెచరీలో స్పాన్ తయారుచేసి పిల్లలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఇదంతా జూన్ మాసం నుంచి ఆగస్టు 2వ వారం వరకు పూర్తి చేసి పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉచితంగా సరఫరా చేసేవారు. ఈ కేంద్రంలో బంగారు తీగ, బొచ్చ, కట్ల, రోహూ రకాల 14లక్షల చొప్పున, గంబూషీయా చేప పిల్లలు లక్ష మేర ఉత్పత్తి జరిగేది. కానీ పరిస్థితులు అనువుగా లేక ఇప్పటివరకు కూడా ఉత్పత్తి మొదలుకాలేదు. వైరా మత్స్య విత్తన కేంద్రం పరిధిలో 6వేల మందితో కూడి 55 మత్స్య సొసైటీలు ఉన్నాయి. వీరు 493 చెరువుల్లో చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నారు.
దిగుమతి అవసరమే ఉండదు..
చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏటా మత్స్యకారులకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై చేపపిల్లల పంపిణీకి టెండర్లు ఆహ్వానిస్తోంది. ఇందుకు రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తున్నారు. అయితే, వైరా కేంద్రంలో చేపపిల్లలు ఉత్పత్తి మొదలైతే బయట కొనుగోలు చేయకుండా ఉమ్మడి జిల్లాలోని చెరువులన్నింటికీ సరఫరా చేయొచ్చు.
ఇవీ ప్రధాన సమస్యలు...
తల్లి చేపల నుంచి సేకరించే గుడ్లను హెచరీలో స్పాన్‌గా మారుస్తారు. అయితే, కేంద్రంలోని హెచరీ గది ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. ఫలితంగా శిథిలమవడంతో పాటు పైపులైన్ల లీకేజీతో నీరు సరఫరా కావడం లేదు. అలాగే, బాయిలర్లు తుప్పుపట్టిపోయాయి. అంతేకాక కేంద్రంలోని 38 సిమెంట్ పాండ్లకు ఎనిమిది శిథిలమవగా.. మరో ఐదు పాండ్ల లైనింగ్ కూలిపోయింది. అలాగే, మోటర్ కూడా సక్రమంగా పనిచేయడం లేదు. వీటికి తోడు ప్రహరీ లేక, 48ఏళ్ల క్రితం నిర్మించిన కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడం గమనార్హం.
వైరాలో 48ఏళ్ల క్రితం
చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు
ఇక్కడే గంబూషియా చేపపిల్లలు కూడా..
నిర్వహణ లోపంతో నానాటికీ
కుదేలవుతున్న కేంద్రం
అయినా పట్టింపు లేనట్లుగా అధికారులు
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
కేంద్రంలో వసతులు లేక చేపపిల్లల ఉత్పత్తి ఇబ్బందిగా మారింది. ఇక్కడి సమస్యలను అధికారులకు నివేదించాం. మత్స్య విత్తన కేంద్రం ఆధునికీకరణకు ప్రతిపాదనలు కూడా పంపించాం. నిధులు మంజూరైతే సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.
– శివప్రసాద్, ఎఫ్‌డీఓ, వైరా

ఉత్పత్తి.. ఉత్తుత్తే...