
కుక్క, కోతి దాడిలో నలుగురికి గాయాలు
ముదిగొండ: మండలంలోని న్యూలక్ష్మీపురం, ముదిగొండ, యడవల్లి గ్రామాల్లో శనివారం కుక్క, కోతి చేసిన దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వీధిలో వెళుతున్న నఫీసా, మరో కూలీపై కుక్క దాడి చేయగా, మరో ఇద్దరిపై కోతులు దాడి చేశాయి. ఈమేరకు గాయపడిన వారికి ముదిగొండ పీహెచ్‌సీలో చికిత్స చేయించారు.
మట్టి తోలకాలపై రగడ
నేలకొండపల్లి: మట్టి తోలకం విషయంలో ఇరువర్గాల నడుమ ఘర్షణ జరగగా పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. మండలంలోని కోనాయిగూడెం శివారు గుట్ట (కోరటేన్) వద్ద మూడు రోజులుగా జేసీబీలతో మట్టి తవ్వి తరలిస్తున్నారు. అయితే, శనివారం సదరు భూమి తమదంటే తమదని ఇరువురు రైతులు గొడవ పడగా వారి తరఫున జనం చేరడంతో వివాదం నెలకొంది. ఈ విషయం తెలిసి చేరుకున్న పోలీసులు సరైన పత్రాలతో స్టేషన్‌కు రావాలని సూచించగా ఇరువర్గాల వారు వెళ్లారు. అయితే, హద్దులు తేలే వరకు ఎవరూ మట్టి తవ్వొద్దని పోలీసుల సూచనలతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే, మట్టి తవ్వకంపై మైనింగ్ అధికారులను వివరణగా తామెవరికీ అనమతి ఇవ్వలేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అదుపు తప్పి స్తంభాన్ని ఢీకొట్టిన కారు
నేలకొండపల్లి: ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా తీగలు తెగిపడడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ముగ్గురికు తీవ్ర గాయాలయ్యాయి. నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లికి చెందిన పానుగోతు ఉపేందర్ కూసుమంచి మండలంలోని గట్టుసింగారం నుంచి కారులో శనివారం ఇంటికి వస్తున్నారు. రాజేశ్వరపురం వద్ద ఎదురుగా వస్తున్న గేదెను తప్పించే క్రమాన స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో కారు నుజునుజ్జు కాగా తీగలు తెగి పడగా స్థానికులు ఆందోళన చెందారు. ఈ ప్రమాదంలో పానుగోతు ఉపేందర్, మురళీనాయక్‌తో పాట ఏడేళ్ల బాలుడు జయంత్‌కుమార్‌కు తీవ్ర గాయాలు కాగా ఖమ్మం తరలించారు.
ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ
తల్లాడ: మండలంలోని కుర్నవల్లిలో పలువురు రైతుల ట్రాక్టర్ల నుంచి బ్యాటరీలు చోరీ అయ్యాయి. గ్రామ రైతులు యరమల వెంకట్రామిరెడ్డి, అయిలూరి కృష్ణారెడ్డి, పెద్ద కృష్ణారెడ్డి ట్రాక్టర్లలోని బ్యాటరీలను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈమేరకు బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుక్క, కోతి దాడిలో నలుగురికి గాయాలు