
సకాలంలో వ్యాక్సినేషన్‌తో వ్యాధులు దూరం
తల్లాడ/కల్లూరు: అవసరమైన మేర వ్యాక్సిన్లను సకాలంలో వేయడం ద్వారా ప్రజలు వ్యాధుల బారిన పడకుండా కాపాడొచ్చని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.వెంకటరమణ తెలిపారు. తల్లాడ, కల్లూరు పీహెచ్‌సీల్లో శనివారం తనిఖీ చేసిన ఆయన వ్యాక్సిన్ల నిల్వలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ పిల్లలకు 12 రకాల వ్యాధులు రాకుండా టీకాలు అందుబాటులో ఉన్నందున తల్లిదండ్రులు సకాలంలో వేయించేలా సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. ఆతర్వాత కల్లూరు అంబేద్కర్ నగర్‌లో వ్యాక్సినేషన్‌ను ఆయన పరిశీలించారు. వైద్యాధికారి నవ్యకాంత్, ఉద్యోగులు కె.పెద్ద పుల్లయ్య, శ్రీనివాస్, శిరీష, శ్రావణ సంధ్య, సరోజిని, జి.రామారావు, అనూష, భారతి, నాగమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
మత్తుమందు ఇచ్చి
ఆభరణాలు చోరీ
కూసుమంచి: కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అది తాగాక యువతి స్పృహ కోల్పోవడంతో ఆమె చెవి జూకాలు ఎత్తుకెళ్లిన ఘటన ఇది. మండలంలోని చేగొమ్మకు చెందిన చుంచు ఉమారాణి, ఆమె సోదరుడు ప్రవీణ్ ఇద్దరూ మానసిక దివ్యాంగులు. శుక్రవారం మధ్యాహ్నం వారిద్దరు ఇంటి వద్ద ఉండగా ఓ మహిళ, మరో వ్యక్తి వచ్చారు. ఉమారాణి, ప్రవీణ్‌తో మాట్లాడుతూనే ముందుగా మత్తుమందు కలిపి తీసుకొచ్చిన కూల్‌డ్రింక్‌ను వారికి ఇవ్వగా తాగి స్పృహ కోల్పోయారు. ఆపై ఉమారాణి చెవులకు ఉన్న జూకాలు తీసుకుని నిందితులు పారిపోయారు. ఘటనపై బాధితురాలి మామ తిరుపతయ్య ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థికి గాయాలు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నయాబజార్ స్కూల్ ఎదురుగా శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో విద్యార్థికి గాయాలయ్యాయి. నయాబజార్ స్కూల్ ప్రాంగణంలోని బీసీ వసతిగృహంలో ఉంటున్న తెల్దారుపల్లికి చెందిన విద్యార్థి వివేకవర్ధన్ రెండు రోజుల వరుస సెలవులతో శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లాడు. తిరిగి శనివారం తిరిగి ఖమ్మం రాగా, కాల్వొడ్డు వద్ద రోడ్డు దాటుతున్న సమయాన టాటా ఏస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వివేకవర్ధన్‌ను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మత్తులో
నలుగురిపై దాడి
కామేపల్లి: ఓ వ్యక్తి మత్తులో నలుగురిపై సర్జికల్ బ్లేడుతో దాడి చేసి గాయపర్చాడు. మండలంలోని కొత్తలింగాలకు చెందిన రెట్టాల గోపీ శనివారం రాత్రి మద్యం లేదా గంజాయి మత్తు లో ఉన్నట్లు తెలుస్తుండగా, గ్రామానికే చెందిన ఎలమందల రాహుల్, కొరివి నాగేశ్వరరావు, శ్యామ్, గుదిమళ్ల సాయిపై దాడి చేశాడు. గాయపడిన వీరిని ఖమ్మం తరలించారు.