
ఇక పవర్ ‘ఫుల్’
కూసుమంచి: మండలంలోని పాలేరులో ఉన్న మినీ హైడల్ ప్రాజెక్టు(జల విద్యుదుత్పత్తి కేంద్రం)లో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్టలు తెగిపోగా ప్రాజెక్టులోని యూనిట్లు, ప్యానల్ బోర్డులు సైతం నీటమునిగాయి. ఈ ప్రాజెక్టును జెన్‌కో ఆధ్వర్యాన పులిచింతల ప్రాజెక్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈమేరకు మరమ్మతుల కోసం రూ.5.50కోట్లు కేటాయించగా కొద్ది నెలలుగా చేపడుతున్న పనులు చివరి దశకు చేరాయి.
భారీ గండి పూడ్చివేత
భారీ వరదతో రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టుకు నీరు సరఫరా చేసే కాల్వ కట్టలు తెగిపోయి గండి పడింది. దీంతో ప్రాజెక్టు కాల్వ నామరూపాలు లేకుండా పోయింది. ఈనేపథ్యాన అధికారులు వందలాది లారీల మట్టితో కట్టను యథావిధిగా నిర్మించారు. అంతేకాక మరోమారు వరద వచ్చినా ఇబ్బంది ఎదురుకాకుండా కాంక్రీట్‌తో పటిష్టం చేశారు. అలాగే, ప్రాజెక్టు ముందు భాగం కూడా వరద ప్రవాహంతో కోతకు గురవడంతో పటిష్టం చేసి సీసీ రహదారి నిర్మించి పూర్వ స్థితికి తీసుకొచ్చారు.
రెండు యూనిట్లు సిద్ధం
ప్రాజెక్టులో విద్యుదుత్పత్తికి రెండు టర్బయిన్లు(యూనిట్లు) ఏర్పాటుచేశారు. ఇందులో ఒక్కో యూనిట్ గంటకు ఒక మెగావాట్ చొప్పున విద్యుదుత్పత్తి చేస్తాయి. వరదలకు ముందే ఒక యూనిట్ మరమ్మతులకు గురవడం, వరదల్లో మరో యూనిట్ దెబ్బతినడంతో రెండింటికీ అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టారు. అలాగే, నీట మునిగిన విద్యుత్ ప్యానెల్ బోర్డులను సైతం సరిచేశారు. ఇక మిగిలిన చిన్నచిన్న మరమ్మతులు చివరి దశకు చేరాయి. పాలేరు రిజర్వాయర్ నుండి ఎడమ కాల్వకు నీరు విడుదల చేసినప్పుడు ఆ నీరు, రిజర్వాయర్ నీటిమట్టం ఆధారంగా ఈ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కాగా, రిజర్వాయర్‌కు త్వరలోనే సాగర్ జలాలు సరఫరా చేయనుండడడంతో జిల్లాలోని ఆయకట్టుకు విడుదల చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే సమయాన ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు.
విద్యుదుత్పత్తికి
మినీ హైడల్ ప్రాజెక్టు సిద్ధం
కాల్వ కట్టలు పటిష్టం,
యూనిట్లకు మరమ్మతులు
గతేడాది భారీ వరదలతో
దెబ్బతిన్న ప్రాజెక్టు
అన్ని పనులు పూర్తి
పాలేరు వద్ద మినీ హైడల్ ప్రాజెక్టు వరదలతో దెబ్బతినగా పూర్తిస్థాయిలో మరమ్మతులు
చేపట్టాం. ప్రాజెక్టులో సివిల్, ఇంజనీరింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. మిగిలిన చిన్నపాటి
పనులు త్వరలోనే పూర్తిచేసి విద్యుత్ ఉత్పత్తి
మొదలుపెట్టేలా సిద్ధం చేస్తున్నాం.
– దేశ్యానాయక్, ఎస్‌ఈ, పులిచింతల ప్రాజెక్టు

ఇక పవర్ ‘ఫుల్’