
రవాణా శాఖలో వసూళ్ల దందా..
● ఏ పనికై నా ఏజెంట్లే సూత్రధారులు ● సత్తుపల్లి కార్యాలయ ఉద్యోగులపై రైతులు, వాహనదారుల విమర్శలు
సత్తుపల్లి: రాష్ట్రంలోని పలుచోట్ల రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నా సత్తుపల్లిలో మాత్రం అధికారుల తీరు మారడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సత్తుపల్లి రవాణా శాఖ కార్యాలయంలో కొందరు ఉద్యోగులు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా వచ్చే పనులే చేస్తూ నేరుగా వచ్చే వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారని తెలు స్తోంది. గతంలో ఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా ఓ జూనియర్ అసిస్టెంట్ పట్టుబడ్డాడు. అయినా తీరు మారకపోవడం గమనార్హం.
తనిఖీల్లో వసూళ్ల పర్వం
వాహనాల తనిఖీ సందర్భంగా ఎంవీఐ ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు వాహనదారులు ఆరోపిస్తున్నారు. పత్రాల్లో ఏ మాత్రం తేడా ఉన్నా కాసులు సమర్పించాల్సి వస్తోందని వాపోతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీకి సరిహద్దుగా ఉండడంతో రెండు రాష్ట్రాల వాహనాలు అటూఇటు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈక్రమంలోనే పర్మిట్ల పేరిట పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారనే విమర్శ వస్తుంది. ఇక రవాణా శాఖ కార్యాలయానికి ఏ పనిపై వెళ్లినా ఏజెంట్లను ఆశ్రయిస్తే సులువుగా పూర్తవుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే వాహనదారులు సొంతంగా వెళ్తే రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని చెబుతున్నారు.
రైతుల ట్రాక్టర్లనూ వదలకుండా..
వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పట్టణాలకు వెళ్లివస్తున్నారు. ఈక్రమంలోనే రైతులను బెదిరిస్తున్న రవాణా శాఖ ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులను ఆశ్రయించినట్లు సమాచారం. పన్నులు, ఇతర పేర్లతో రైతులను ఇబ్బంది పెడుతున్న ఎంవీఐపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
రోడ్ ట్యాక్స్ కట్టకపోతే జరిమానా
వ్యవసాయ ఉత్పత్తులు తీసుకెళ్తున్న ట్రాక్టర్లపై ఎప్పుడు కేసులు రాయలేదు. రోడ్డు ట్యాక్స్ కట్టని వాటిపైనే కేసు నమోదు చేసి జరిమానా విధించాం. మా కార్యాలయంలో ఏజెంట్ల వ్యవస్థ అసలే లేదు. కొందరు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే.
– శ్రీనివాసరావు, ఎంవీఐ, సత్తుపల్లి