
‘అబద్ధాలతోనే రేవంత్ పాలన’
ఖమ్మంరూరల్: అబద్ధాలు చెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎదులాపురం సాయిగణేశ్‌నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనిస్తున్నారని, బీఆర్‌ఎస్ అంటే భరోసా అని, కాంగ్రెస్ అంటే కన్నింగ్ అని పేర్కొన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టటమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రైతుబంధు నిధులు ఎగ్గొట్టారని, విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్‌లో అర్ధరాత్రి వరకు నిలడబడాల్సి వస్తోందని తెలిపారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ విసిరిన సవాల్ స్వీకరించి చర్చకు రావాలని సూచించారు. సమావేశంలో బెల్లం వేణుగోపాల్, భాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, జర్పుల లక్ష్మణ్‌నాయక్, కోటి సైదారెడ్డి, ఉదయ్, సొడేపొంగు ప్రశాంత్, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు.