
భళా.. ప్రభుత్వ పాఠశాల
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించడం.. నాణ్యమైన విద్య, ఉచితంగా యూనిఫామ్, పౌష్టికాహారం అందిస్తున్నామని చేసిన విస్తృత ప్రచారంతో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈమేరకు జిల్లాలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి గత విద్యాసంవత్సరం కంటే ఈ ఏడాది 1,886మంది విద్యార్థులు పెరిగారు. గత విద్యాసంవత్సరం(2024–25)లో 66,289మంది ఉండగా... ఈసారి(2025–26) ఆ సంఖ్య 68,175కు చేరింది.
అత్యధికంగా ఖమ్మం రూరల్
ఈ విద్యాసంవత్సరం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 359మంది విద్యార్థులు పెరిగారు. అతి తక్కువగా మధిర మండలంలో ఆరుగురే పెరిగారు. ఇక కూసుమంచి మండలంలో 318, ఖమ్మం అర్బన్‌లో 218, సత్తుపల్లిలో 167, సింగరేణిలో 158, పెనుబల్లిలో 121, కల్లూరులో 105, బోనకల్‌లో 104, ఎర్రుపాలెంలో 91, ఏన్కూరులో 75, ముదిగొండలో 63, వేంసూరులో 59, నేలకొండపల్లిలో 44, తిరుమలాయపాలెంలో 39, రఘునాథపాలెంలో 29, తల్లాడలో 15, కామేపల్లిలో 11మంది విద్యార్థులు గత ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యారు.
ఇక్కడ తగ్గారు...
జిల్లాలోని కొణిజర్ల మండలంలో 60మంది, చింతకానిలో 33మంది, వైరాలో ముగ్గురు విద్యార్థులు గత ఏడాదితో పోలిస్తే తగ్గడం గమనార్హం. గత విద్యాసంవత్సరం కొణిజర్ల మండలంలో 3,294 మంది ఉండగా ఈసారి ఆ సంఖ్య 3,234కి పడిపోయింది. చింతకాని మండలంలో గత విద్యాసంవత్సరం 2,849మంది ఉండగా 33మంది తగ్గారు. అలాగే, వైరా మండలంలో గత ఏడాది 2,634మంది ఉండగా ఈ ఏడాది 2,631మందికి చేరారు.
జిల్లా కేంద్రంలో ముందస్తు ప్రచారం
బడిబాట కార్యక్రమం ఖమ్మం అర్బన్ మండలం(జిల్లా కేంద్రం)లో సత్ఫలితాలు ఇచ్చింది. నగరంలో 75ప్రభుత్వ పాఠశాలలు ఉండగా గత ఏడాది 9,420మంది విద్యార్థులు చదివారు. ఈసారి ఆ సంఖ్య 9,639మందికి చేరడం విశేషం. ఇందులో బడిబాట ద్వారా 2,177మంది విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా ఖమ్మం ఎన్నెస్సీ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 285మంది చేరగా.. ఇదే కాలనీ ప్రాథమిక పాఠశాలలో 137మంది, నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 100మంది చేరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధన కొనసాగుతుండడం ప్రవేశాలు పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఇక ఖమ్మంలోని రుద్రంకోటలో రెండేళ్లు క్రితం మూతపడిన పాఠశాలను ఈఏడాది పునఃప్రారంభించగా 15మంది చేరారు. అలాగే, నిజాంపేట పాఠశాలలో ఐదుగురే విద్యార్థుల ఉండగా ఈసారి ఆ సంఖ్య 13కు చేరింది.
ఈ ఏడాది పెరిగిన 1,886మంది
విద్యార్థులు
కొణిజర్ల, చింతకాని,
వైరాలో తప్ప అన్ని చోట్ల పెరుగుదల
ప్రథమ స్థానంలో
ఖమ్మం రూరల్ మండలం
బడిబాటతో మంచి ఫలితం
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకతలు, బోధన వివరాలను బడిబాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. దీంతో ప్రవేశాలు పెరిగాయి. విస్తృత ప్రచారంతో 100మంది చేరగా... మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 337కు చేరింది.
– సుధారాణి, హెచ్‌ఎం, నయాబజార్ హైస్కూల్
అన్ని పాఠశాలల్లో పెరిగారు..
మండలంలోని అన్ని పాఠశాలల్లో గతంలో కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది. రుద్రంకోట స్కూల్‌ను పునఃప్రారంభించాం. హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ముందస్తుగా ప్రచారం చేయడం ప్రవేశాలు పెరగడానికి దోహదపడింది.
– శైలజలక్ష్మి, ఎంఈఓ, ఖమ్మం అర్బన్

భళా.. ప్రభుత్వ పాఠశాల

భళా.. ప్రభుత్వ పాఠశాల

భళా.. ప్రభుత్వ పాఠశాల