‘స్వయం’ ఉపాధి | - | Sakshi
Sakshi News home page

‘స్వయం’ ఉపాధి

Jun 16 2025 5:57 AM | Updated on Jun 16 2025 5:57 AM

‘స్వయ

‘స్వయం’ ఉపాధి

ఖమ్మంమయూరిసెంటర్‌ : జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు (ఎస్‌హెచ్‌జీ) సాధిస్తున్న విజయం ఆత్మనిర్భరతకు, సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. వృత్తిపరమైన వ్యాపారాలు చేయడంతో పాటు స్వయం ఉపాధి పొందేందుకు గల వనరులను వినియోగించుకుంటూ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందించే యూనిఫామ్‌ను మహిళా సంఘాల సభ్యులు కుట్టి ఉపాధి సాధించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ఈ క్లాత్‌, కొలతలను అందించగా యూనిఫామ్‌ తయారుచేసి విద్యాశాఖకు అందజేశారు. మొదటి దశలో డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళలు 72,432 యూనిఫామ్‌లు కుట్టగా.. రెండో దశకు సంబంధించిన ఆర్డర్‌ త్వరలోనే విద్యాశాఖ నుంచి రానున్నట్లు తెలిసింది.

సకాలంలో అందజేత..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్‌ అందజేస్తోంది. వీటిని కుట్టే బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా.. మహిళా సంఘాల సభ్యులకు అప్పగించారు. వేసవిలో యూనిఫామ్‌ వస్త్రాలను జిల్లా అధికారులు మహిళా సంఘాల సభ్యులకు అందజేయగా.. వారు ఇచ్చిన కొలతల ప్రకారం కుట్టారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 20 మండలాల్లో 77 కేంద్రాలు ఏర్పాటు చేసి 56,614 యూనిఫామ్‌లు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా ఆయ కేంద్రాల్లో 583 మంది మహిళలు ఉపాధి పొందారు. మెప్మా ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌, సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో కేంద్రాలను ఏర్పాటు చేయగా 108 మంది మహిళలు 15,818 యూనిఫామ్‌లను తయారు చేశారు. మొదటి దశలో విద్యాశాఖ నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం యూనిఫామ్‌ కుట్టి పాఠశాలల పునఃప్రారంభం నాటికి అందజేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. ఇలా కుట్టిన మహిళలకు ఒక్కో యూనిఫామ్‌కు రూ.75 చొప్పున చెల్లించనున్నారు. నెల రోజుల్లో ఈ వేతనం వారికి అందనుందని అధికారులు వెల్లడించారు.

ఎస్‌హెచ్‌జీలకు యూనిఫామ్‌ తయారీ బాధ్యతలు

జిల్లాలో 72,432 యూనిఫామ్‌లు కుట్టిన సభ్యులు

సకాలంలో పాఠశాలలకు అందజేత

మహిళల్లో పెరిగిన ఆత్మనిర్భరత..

నాలుగు నెలల పాటు ఉపాధి..

పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ కుట్టడంతో ఉపాధి లభిస్తోంది. సంవత్సరంలో నాలుగు నెలల పాటు ఉపాధి దొరుకుతుంది. యూనిఫామ్‌ తయారీతో నెలకు రూ.12 వేల వరకు సంపాదిస్తున్నా. టైలరింగ్‌ నేర్చుకున్నందుకు మంచి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఆదాయం కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుంది.

– ఎన్‌.మాధవి,

కృష్ణవేణి గ్రూప్‌ సభ్యురాలు, ఖమ్మం

ఆనందంగా ఉంది..

టైలరింగ్‌ నేర్చుకున్న తర్వాత స్కూల్‌ యూనిఫామ్స్‌ కుట్టడం ఆనందంగా ఉంది. మహిళా సభ్యులకు యూనిఫామ్‌ కుట్టే బాధ్యతలు ఇచ్చి ప్రభుత్వం మాకు మంచి ఉపాధి చూపించింది. మాకిచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేశాం. యూనిఫామ్‌ తయారీ ద్వారా వచ్చే వేతనంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవచ్చు.

– ఎస్‌కె.ఫర్హానా,

మధర్‌థెరిస్సా గ్రూప్‌ సభ్యురాలు, ఖమ్మం

ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా..

జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు నైపుణ్యాన్ని, కష్టపడే తత్వాన్ని చాటుతూ యూనిఫామ్‌ తయారీ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 56,614, మెప్మా ఆధ్వర్యంలో 15,818 యూనిఫామ్‌లను కుట్టారు. తద్వారా మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా లబ్ధి పొందడమే కాక, నైపుణ్యాలను మెరుగుపర్చుకున్నారు. సామూహిక కృషి, పరస్పర సహకారంతో వారు ఈ పనిని విజయవంతం చేశారు.

‘స్వయం’ ఉపాధి1
1/2

‘స్వయం’ ఉపాధి

‘స్వయం’ ఉపాధి2
2/2

‘స్వయం’ ఉపాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement