మహిళ వస్త్రాలు ఎత్తుకెళ్లిన దుండగుడు!
నేలకొండపల్లి: ఓ దొంగ రెక్కీ నిర్వహించాడంటే ఆ ఇంట్లో నగలు, డబ్బు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేస్తాడు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి కేవలం మహిళల వస్త్రాలే ఎత్తుకెళ్లడం గమనార్హం. నేలకొండపల్లిలో ఓ మహిళ శనివారం దుస్తులు ఉతికి ఆరుబయట దండెంపై ఆరేసింది. ఆ ఇంటి వద్ద అటూఇటు ఓ యువకుడు తిరుగుతుండగా స్థానికులు ప్రశ్నిస్తే సేల్స్‌మేన్‌గా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి దండెంపై ఆరేసిన మహిళ వస్త్రాలను బ్యాగ్‌లో పెట్టుకుని పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ఎదురుగా ఉన్న షాప్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
మైనర్, డ్రంకెన్ డ్రైవింగ్ కేసుల్లో జరిమానా
ఖమ్మంక్రైం: వాహనాలు నడుపుతూ పట్టుబడిన 34 మంది మైనర్లకు రూ.వెయ్యి చొప్పున, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో 75 మందికి రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించిందని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో పట్టుబడిన మైనర్లు, మద్యం తాగిన వారిని కోర్టులో హాజరుపర్చగా నాలుగో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ (స్పెషల్ మొబైల్) న్యాయమూర్తి బి.నాగమణి జరిమానా విధించారని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు
వైరారూరల్: మండంలోని స్టేజీ పినపాక సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని విప్పలమడకకు చెందిన అక్కిశెట్టి కృష్ణారావు వైరాలో హమాలీగాపనిచేస్తున్నాడు. పని ముగిశాక ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా తల్లాడ వైపు నుంచి ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణారావును పోలీసులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
మిషన్ భగీరథ
సర్వీసుల తనిఖీ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ల విద్యుత్ సర్వీసులను ఎన్పీడీసీఎల్ అధికారులు శనివారం తనిఖీ చేశారు. ఆయా ప్లాంట్ల కనెక్షన్లు, ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అంశాలను పరిశీలించారు. ఖమ్మంలోని పలు సర్వీసుల తనిఖీ డీఈ(ఆపరేషన్స్) నంబూరి రామారావు ఆధ్వర్యాన కొనసాగింది.


